అలా చేస్తే కఠిన చర్యలు.. తిరుమల బ్రహ్మోత్సవాలపై పోలీసుల వార్నింగ్!

అలా చేస్తే కఠిన చర్యలు.. తిరుమల బ్రహ్మోత్సవాలపై పోలీసుల వార్నింగ్!

Tirumala Brahmotsavam 2026 police issue warning against social media rumors
  • శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ వదంతులు నమ్మొద్దని పోలీసుల హెచ్చరిక
  • తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ 
  • అధికారిక ప్రకటనలనే అనుసరించాలని భక్తులకు విజ్ఞప్తి 
  • భద్రత కోసం 6,071 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు
  • సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న వేళ, తిరుపతి జిల్లా పోలీసులు భక్తులకు కీలక సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు వార్తలు, వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అసత్య ప్రచారాలనూ నమ్మవద్దని కోరారు.

దర్శనం, వాహన సేవలు, భక్తుల రద్దీ, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ వంటి వివరాల కోసం టీటీడీ, తిరుపతి పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, ప్రకటనలను మాత్రమే అనుసరించాలని స్పష్టం చేశారు. పాత ఫోటోలు, వీడియోలను ప్రస్తుత ఘటనలుగా చిత్రీకరిస్తూ చేసే పోస్టులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. 

పోలీసులు లేదా టీటీడీ లోగో ఉన్నంత మాత్రాన అది అధికారిక సమాచారమని భావించవద్దని, సంబంధిత వెబ్‌సైట్లు లేదా అధికారిక వేదికల్లో నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రమాదాలు, తొక్కిసలాటలు జరిగాయని, మార్గాలు మూసివేశారని వచ్చే నిర్ధారణ లేని సందేశాలు చూసి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రత, సౌకర్యాలే లక్ష్యంగా తిరుమల, తిరుపతిలో విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. మొత్తం 6,071 మంది పోలీసు సిబ్బందిని రెండు దశల్లో బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్లు వివరించారు. 

వీరిలో తిరుమలలో 4,783 మంది, తిరుపతిలో 1,288 మంది విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి క్రౌడ్ మేనేజ్‌మెంట్, భక్తులతో వ్యవహరించాల్సిన తీరు, తిరుమల పవిత్రత పరిరక్షణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు.

భక్తుల్లో భయాందోళనలు సృష్టించే పోస్టులు కనిపిస్తే, వాటి స్క్రీన్‌షాట్లు లేదా లింకులను పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 112కు ఫోన్ చేయాలని లేదా దగ్గర్లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆశ్రయించాలని తెలిపారు. 

విధుల్లో ఉన్న పోలీసుల సూచనలు, అధికారిక మైక్ ప్రకటనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో స్వామివారి సేవలో పాల్గొనాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Advertisement
Tirupati District Police
Tirumala Brahmotsavam 2026
TTD fake news warning
Tirumala security arrangements
Tirupati SP Subbarayudu
Srivari Brahmotsavalu

More Telugu News