భార్య తల నరికిన నిందితుడు.. పోలీస్ వాహనం నుంచి దూకి మృతి

భార్య తల నరికిన నిందితుడు.. పోలీస్ వాహనం నుంచి దూకి మృతి

Ramanuj Goswami who beheaded wife dies after jumping from police vehicle
  • వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా అస్సాంలో ఘటన
  • తప్పించుకునే ప్రయత్నమా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
  • భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన కేసులో నిందితుడు రామానుజ్ గోస్వామి
అస్సాంలో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో నిందితుడు రామానుజ్ గోస్వామి (28) మరణించాడు. పోలీసు కస్టడీలో ఉండగా, వైద్య పరీక్షల కోసం తరలిస్తున్న సమయంలో కదులుతున్న వాహనం నుంచి దూకి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున గువాహటిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడు రోజుల పోలీసు కస్టడీ ముగుస్తుండటంతో, వైద్య పరీక్షల నిమిత్తం రామానుజ్ గోస్వామిని సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో హాటిగావ్ పోలీస్ స్టేషన్ నుంచి గౌహతి మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో నరకాసుర పహార్ వద్ద పోలీసు వాహనం టైరు పంక్చర్ అయింది. దాన్ని మార్చిన తర్వాత వాహనం మళ్లీ బయలుదేరింది. ఆ సమయంలో గోస్వామి తన పక్కనున్న కానిస్టేబుల్‌ను కాలితో తన్ని, కదులుతున్న వాహనం నుంచి కిందకు దూకేశాడు.

ఈ క్రమంలో రోడ్డుపై పడి, అక్కడి నుంచి పక్కనే ఉన్న లోయలోకి జారిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గోస్వామి శరీరంపై ఎలాంటి బుల్లెట్ గాయాలు లేవని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

భార్య రియా తాలుక్‌దార్ (25) వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో గువాహటిలోని వారి ఫ్లాట్‌లో ఈ నెల 3న గోస్వామి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో తల నరికి, దాన్ని ఓ పాలిథిన్ కవర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో దాచాడు. సెప్టెంబర్ 6న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గోస్వామి తప్పించుకునేందుకు ప్రయత్నించాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Ramanuj Goswami
Guwahati wife murder
Assam police custody death
Riya Talukdar murder
Fridge murder case Assam
Narakasura Pahar Guwahati

More Telugu News