పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ సిబ్బందిపై దాడి ఆరోపణలు... స్పందించిన పోలీసులు

పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ సిబ్బందిపై దాడి ఆరోపణలు... స్పందించిన పోలీసులు

KTR staff attack allegations at police station Police respond
  • కేటీఆర్ సిబ్బందిపై దాడి ఆరోపణలను ఖండించిన పోలీసులు
  • స్టేషన్‌లో జరిగింది వేరంటూ వివరణ ఇచ్చిన సైఫాబాద్ పోలీసులు
  • మాస్క్‌లతో పోలీసులు దాడి చేశారని హరీశ్ రావు ఆరోపణ
  • ఇది రౌడీల రాజ్యమంటూ కేటీఆర్ ఫైర్, జ్యుడీషియల్ విచారణకు డిమాండ్
  • ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపిన పోలీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సిబ్బందిపై పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగిందన్న ఆరోపణలను హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసులు ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. కేటీఆర్ పీఆర్ఓ మహేశ్, పీఏ మహేందర్‌లపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌ ఇంటరాగేషన్ గదిలో మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ లీగల్ టీమ్ సభ్యులు గట్టిగా నిలదీయడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారని ఆయన వెల్లడించారు.

ఈ ఘటనపై కేటీఆర్ సైతం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో 'రౌడీలు, గూండాల రాజ్యం' నడుస్తోందని విమర్శించారు. ఈ అమానుష దాడిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే, ఈ ఆరోపణలను సైఫాబాద్ పోలీసులు పూర్తిగా తోసిపుచ్చారు. అసలు ఏం జరిగిందనే అంశంపై స్పష్టత ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. గణేశ్ మండపం వద్ద డీజే నిర్వహణకు అనుమతి కోరుతూ కొందరు యువకులు స్టేషన్‌కు వచ్చారని వెల్లడించారు. అయితే, అసెంబ్లీ సమీపంలో న్యూసెన్స్ సృష్టించిన కేసులో అదుపులో ఉన్నవారిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని వారు వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. వెంటనే తాము ఆ యువకులను అక్కడి నుంచి పంపించివేశామని, పోలీసుల సమక్షంలో దాడి జరిగిందన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
Advertisement
KTR
Saifabad Police Station
Harish Rao
BRS staff attack
Hyderabad Police

More Telugu News