శ్రీవారి గరుడ సేవకు చెన్నై గొడుగులు.. ఇది 190 ఏళ్ల ఆనవాయతీ!

శ్రీవారి గరుడ సేవకు చెన్నై గొడుగులు.. ఇది 190 ఏళ్ల ఆనవాయతీ!

Chennai umbrellas for Srivari Garuda Seva is a 190 year old tradition
  • శ్రీవారి గరుడ సేవకు వినియోగించే గొడుగులకు చెన్నైతో శతాబ్దాల అనుబంధం
  • సుమారు 190 ఏళ్లుగా తిరునిన్రావూర్ భక్తులు ఈ కైంకర్యాన్ని కొనసాగింపు
  • చెన్నైలో యాత్రగా మొదలై, తిరుచానూరు మీదుగా తిరుమలకు గొడుగులు 
  • హిందూ ధర్మార్థ సమితి ఆధ్వర్యంలో అత్యంత నియమ నిష్టలతో తయారీ
  • గరుడ సేవకు ముందు రోజు ఈ గొడుగులను టీటీడీకి అందజేత
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలంటే కనుల పండుగే. అందులోనూ గరుడ సేవ అత్యంత ప్రధాన ఘట్టం. ఆ గరుడ వాహనంపై ఊరేగే మలయప్ప స్వామిని అలంకరించే పవిత్ర గొడుగులకు, తమిళనాడు రాజధాని చెన్నైకి మధ్య విడదీయరాని బంధం ఉంది. దాదాపు రెండు శతాబ్దాలుగా ఈ సంప్రదాయం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుండటం విశేషం.

ఈ గొడుగుల సమర్పణ వెనుక చెన్నై సమీపంలోని తిరునిన్రావూర్‌కు చెందిన భక్తుల అనన్య సామాన్యమైన భక్తి ఉంది. సుమారు 190 సంవత్సరాల క్రితం వారు ఈ కైంకర్యాన్ని ప్రారంభించారు. గరుడ సేవ రోజున స్వామివారికి ఎండ, వాన వంటివి తగలకుండా ఈ మంగళకరమైన గొడుగులను అలంకరించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ సేవను ప్రస్తుతం చెన్నైలోని 'హిందూ ధర్మార్థ సమితి శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్' భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తోంది. భగవత్ రామానుజుల సిద్ధాంతాలను అనుసరిస్తూ స్వామివారికి సేవ చేయడమే ఈ ట్రస్ట్ లక్ష్యం.

ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల కోసం మొత్తం 11 గొడుగులను అత్యంత నియమ నిష్టలతో తయారు చేస్తారు. వీటి తయారీలో పాలుపంచుకునే కళాకారులు ఉపవాసం ఉండి, నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ వీటిని రూపొందిస్తారు. 7 నుంచి 9 అడుగుల వ్యాసంతో ఉండే ఈ గొడుగులకు మేలైన పాప్లిన్ వస్త్రాన్ని, వెదురు ఫ్రేమ్‌ను వాడతారు. ఎరుపు, పసుపు రంగు లేసులు, వెల్వెట్ క్లాత్‌తో అలంకరించి, పైన బంగారు వర్ణపు కలశాన్ని అమరుస్తారు.

ఈ గొడుగుల యాత్ర చెన్నై వీధుల్లో వైభవంగా మొదలవుతుంది. వేలాది మంది భక్తులు వీటిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తారు. యాత్రలో భాగంగా ముందుగా రెండు గొడుగులను తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పిస్తారు. మిగిలిన 9 గొడుగులు అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటాయి. ప్రతి ఏటా గరుడ సేవకు ఒకరోజు ముందు వీటిని తిరుమల మాడ వీధుల్లో ఊరేగించి, అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు అధికారికంగా అందజేస్తారు. ఇలా చెన్నైలో మొదలైన ఈ ఆధ్యాత్మిక యాత్ర, తిరుమల బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టానికి సంపూర్ణతను చేకూరుస్తుంది.


Advertisement
Srivari Garuda Seva
Chennai Umbrellas
Tirumala Brahmotsavam
Hindu Dharmartha Samiti
TTD
Tiruchanur Padmavathi Temple

More Telugu News