ఢిల్లీలో.. ఎన్టీఏ ఆఫీసు అడ్రస్ మారింది!

ఢిల్లీలో.. ఎన్టీఏ ఆఫీసు అడ్రస్ మారింది!

National Testing Agency Office Address Changed in Delhi
  • దక్షిణ ఢిల్లీ నుంచి సెంట్రల్ ఢిల్లీకి మారిన ఎన్టీఏ కార్యాలయం
  • కొత్త చిరునామాను అధికారిక సర్క్యులర్‌లో ప్రకటించిన ఏజెన్సీ
  • విద్యార్థులపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఎన్టీఏ డీజీ
  • భారత పరీక్షల వ్యవస్థను ప్రపంచ దేశాలతో పంచుకుంటామని వెల్లడి
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తన కార్యాలయాన్ని నూతన చిరునామాకు మార్చింది. ఇప్పటివరకు దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లాలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్‌కు తరలించినట్లు ఎన్టీఏ సోమవారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఒక సర్క్యులర్ జారీ చేశారు.

అభ్యర్థులు, విద్యార్థులు, విద్యాసంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాలు ఈ మార్పును గమనించాలని కోరారు. భవిష్యత్తులో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), 5వ అంతస్తు (ఫిఫ్త్ ఫ్లోర్), గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ బిల్డింగ్, మింటో రోడ్, న్యూఢిల్లీ - 110002' చిరునామాకు పంపాలని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 సందర్భంగా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వాడకాన్ని నియంత్రించేందుకు సభ్య దేశాల మధ్య సహకారం అవసరమని ఆయన ప్రతిపాదించారు. ఏఐ సాంకేతికత మితిమీరిన వినియోగం విద్యార్థుల ఆలోచనా శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, అనేక దేశాలు దీని వాడకాన్ని నియంత్రించే దిశగా ఆలోచిస్తున్నాయని తెలిపారు.

భారత్‌లో ప్రభుత్వ పరీక్షల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సదరు ఫార్మాట్‌ను డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అభిషేక్ సింగ్ వివరించారు. బ్రిక్స్ ఢిల్లీ డిక్లరేషన్‌కు అనుగుణంగా సాంకేతికతను, అత్యుత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడంపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.
Advertisement
National Testing Agency
NTA New Office Address
Abhishek Singh NTA
Delhi Minto Road
Government of India Press Building

More Telugu News