నన్ను చూసే కోణంలోనే లోపం.. నా దుస్తుల్లో కాదు: ఐశ్వర్య లక్ష్మి
- ఇటీవల ఒక జువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఐశ్వర్య లక్ష్మి
- తనను అనుచిత కోణాల్లో ఫొటీలు తీసేందుకు యత్నించారని మండిపాటు
- దీనివల్ల తన బాడీ లాంగ్వేజ్ మారిందని వెల్లడి
ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల తిరువనంతపురంలో జరిగిన ఒక జువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి హాజరైన సమయంలో ఆమె ధరించిన దుస్తులపై కొందరు నెటిజన్లు అసభ్యకర రీతిలో కామెంట్లు చేశారు. ఈ వివాదంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన ఐశ్వర్య లక్ష్మి, ఆ రోజు ఈవెంట్‌లో జరిగిన అసలు నిజాలను వెల్లడించి ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఆ ఈవెంట్‌లో కొందరు ఫొటోగ్రాఫర్లు తన ముఖాన్ని సరిగా కవర్ చేయకుండా, కావాలనే అనుచిత కోణాల్లో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారని ఆమె బహిరంగంగా ఆరోపించారు. ఆ అసౌకర్య వాతావరణం వల్ల తన బాడీ లాంగ్వేజ్ మారిందని, అంతేకానీ తన దుస్తుల్లో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. ఇబ్బందికరంగా ఉంటే అలాంటి బట్టలు ఎందుకు వేసుకోవడం? అని ప్రశ్నించే వారి మానసికత్వాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
సంస్కృతి అనేది కేవలం మహిళలు వేసుకునే దుస్తుల్లోనే ఉందా, ప్రవర్తనలో ఉండదా..? అని ప్రశ్నించారు. దేశ ఆర్థిక వృద్ధి, వృద్ధుల సంక్షేమం లాంటి సామాజికాంశాలపై చర్చించని సమాజం, మహిళల దుస్తుల గురించి మాట్లాడేందుకు మాత్రం సిద్ధంగా ఉంటుందని ధ్వజమెత్తారు. ఇకనైనా ప్రతీ ఒక్కరూ మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం నేర్చుకోవాలని ఐశ్వర్య హితవు పలికారు.