వైఎస్ రాజశేఖరరెడ్డి మేనత్త కమలమ్మ కన్నుమూత
- కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడిన కమలమ్మ
- అమెరికాలో కుమార్తె నివాసంలో ఉంటూ చికిత్స పొందుతూ కన్నుమూత
- భౌతికకాయాన్ని అమెరికా నుంచి పులివెందులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వైఎస్సార్ మేనత్త వైఎస్ కమలమ్మ (వైఎస్ రాజారెడ్డి సోదరి) కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే ఉంటున్న కుమార్తె మెర్సీ నివాసంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో అమెరికాలోనే తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆమె అనారోగ్యం పాలైన సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దంపతులు పులివెందులలో ఆమెను నేరుగా కలిసి పరామర్శించారు.
అమెరికాలో కన్నుమూసిన వైఎస్ కమలమ్మ భౌతికకాయాన్ని స్వగ్రామమైన పులివెందులకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందులలోని వైఎస్సార్ సమాధుల తోటలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు సమాచారం. కమలమ్మ ఆకస్మిక మృతి పట్ల వైఎస్సార్ భార్య వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ దంపతులు, వైఎస్ షర్మిల, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.