యూకే ముక్కలవనుందా? మూడు ప్రాంతాల నేతలు ఒక్కచోట చేరడం వెనుక అసలు కథేంటి?

యూకే ముక్కలవనుందా? మూడు ప్రాంతాల నేతలు ఒక్కచోట చేరడం వెనుక అసలు కథేంటి?

United Kingdom fragmentation fears as regional leaders meet for constitutional changes
  • స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌ ప్రాంతాల నేతల కీలక భేటీ
  • స్వాతంత్ర్య అనుకూల పార్టీలదే అధికారం
  • స్కాట్లాండ్‌లో రెఫరెండంపై వివాదం
  • ఐర్లాండ్‌ ఏకీకరణపై చర్చ
  • రాజ్యాంగ మార్పులకు నేతల డిమాండ్‌
యునైటెడ్‌ కింగ్‌డమ్‌.. ప్రపంచ రాజకీయాల్లో శతాబ్దాల చరిత్ర ఉన్న దేశం. కానీ ఇప్పుడు దాని భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌ నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజ్యాంగ మార్పుల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. దీంతో యూకే ఇకపై ఇదే రూపంలో కొనసాగుతుందా? అన్న చర్చ మొదలైంది.

మూడు ప్రాంతాల్లోనూ స్వాతంత్ర్య అనుకూల పార్టీలే..
కార్డిఫ్‌లో జరుగుతున్న ఈ కీలక సమావేశంలో స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ నేత జాన్‌ స్విన్నీ, ప్లెయిడ్‌ సిమ్రూ నేత రున్‌ ఆప్‌ ఐయోర్వెత్‌, ఉత్తర ఐర్లాండ్‌ నేత మిషెల్‌ ఓనీల్‌తో పాటు సిన్‌ ఫెయిన్‌ అధ్యక్షురాలు మేరీ లూ మెక్‌డొనాల్డ్‌ పాల్గొంటున్నారు. స్కాట్లాండ్‌, వేల్స్‌, ఐర్లాండ్‌ మధ్య సహకారాన్ని పెంచుకోవడం.. తమ భవిష్యత్తుపై ప్రజలకు మరింత నిర్ణయాధికారం కల్పించడం ఈ భేటీ ప్రధాన ఉద్దేశం.

మేలో జరిగిన వేల్స్‌ ఎన్నికలు ఈ పరిణామానికి మరింత బలం ఇచ్చాయి. అక్కడ ప్లెయిడ్‌ సిమ్రూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్కాట్లాండ్‌లో ఎస్‌ఎన్‌పీ బలమైన పార్టీగా కొనసాగుతోంది. ఉత్తర ఐర్లాండ్‌లో సిన్‌ ఫెయిన్‌ ఇప్పటికే అధికారంలో ఉంది. అంటే యూకేలో భాగమైన మూడు ప్రాంతాల్లోనూ ఇప్పుడు స్వాతంత్ర్య అనుకూల శక్తులు అధికారంలో ఉండటం ఇదే తొలిసారి.

స్కాట్లాండ్‌ విషయంలో సమస్య ఏంటి?
స్కాట్లాండ్‌ స్వాతంత్ర్యంపై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. బ్రిటన్‌ ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి. ప్రజాభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తే స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌లో ఓటింగ్‌ జరిగే అవకాశం ఉందన్న సంకేతాలు ఆయన ఇచ్చారు. అయితే ఆ తర్వాత, స్కాట్లాండ్‌ స్వాతంత్ర్యం, ప్రజాభిప్రాయ సేకరణ అంశాలు తమ ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ఇది స్కాటిష్‌ నేతలకు మరింత ఆగ్రహం తెప్పించింది. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు స్కాట్లాండ్‌ ప్రజలకు ఉండాలని వారు పట్టుబడుతున్నారు.

ఐర్లాండ్‌ ఏకీకరణ చర్చ కూడా..
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘‘ఏదో ఒకరోజు ఐర్లాండ్‌ ఏకమవుతుంది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉత్తర ఐర్లాండ్‌ భవిష్యత్తుపై చర్చకు ఇది మరింత ఆజ్యం పోసింది.

స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌ నేతలు ఇప్పుడు వెస్ట్‌మినిస్టర్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. తమ ప్రాంతాల భవిష్యత్తుపై రాజ్యాంగపరమైన మార్పులకు బ్రిటన్‌ ప్రభుత్వం ముందుగానే సిద్ధం కావాలని కోరుతున్నారు.

మరి నిజంగానే బ్రిటన్‌ విడిపోతుందా?
ప్రస్తుత పరిణామాలను చూస్తే బ్రిటన్‌ వెంటనే విడిపోతుందని చెప్పలేం. స్కాట్లాండ్‌ స్వాతంత్ర్యానికి మరో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్న డిమాండ్‌కే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఉత్తర ఐర్లాండ్‌ విషయంలోనూ ఐర్లాండ్‌తో విలీనం కావాలంటే ప్రత్యేక ప్రక్రియ అవసరం.

అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బ్రిటన్‌లోని ప్రాంతీయ రాజకీయాలు మారుతున్నాయి. లండన్‌ కేంద్రంగా నిర్ణయాలు తీసుకునే విధానంపై అసంతృప్తి పెరుగుతోంది. స్వాతంత్ర్యం, ఎక్కువ అధికారాలు, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలన్న డిమాండ్లు బలపడుతున్నాయి. అందుకే కార్డిఫ్‌లో జరుగుతున్న ఈ భేటీని యూకే భవిష్యత్‌ రాజకీయాలకు కీలక మలుపుగా చూస్తున్నారు.
Advertisement
United Kingdom
Scotland Independence
Northern Ireland Unification
Wales Independence
SNP Sinn Fein Plaid Cymru
John Swinney Michelle ONeill

More Telugu News