సుప్రీంకోర్టు ఆదేశాలతో గోవా న్యాయస్థానంలో లొంగిపోయిన తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్
- 2013 నాటి లైంగిక దాడి కేసు
- 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన బాంబే హైకోర్టు
- హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన తరుణ్ తేజ్‌పాల్
- ముందు జైల్లో లొంగిపోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2013 నాటి లైంగిక దాడి కేసులో 'తెహెల్కా' పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ ఎట్టకేలకు గోవాలోని మాపుసా అదనపు సెషన్స్ కోర్టు ముందు లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన విముక్తి ఉత్తర్వులను పక్కనబెడుతూ, బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఆగస్టు 6న ఆయనను దోషిగా నిర్ధారించి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, ముందుగా జైలులో లొంగిపోయి సర్టిఫికెట్ దాఖలు చేస్తేనే అప్పీలును విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఆయనకు చట్టం ముందు మోకరిల్లక తప్పలేదు.
ఈ కేసు మూలాల్లోకి వెళితే, 2013 నవంబరులో గోవాలోని ఒక స్టార్ హోటల్ లిఫ్ట్‌లో తన వద్ద పనిచేసే జూనియర్ మహిళా జర్నలిస్ట్‌పై తేజ్‌పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘ కాలం సాగిన విచారణ అనంతరం 2021 మే నెలలో గోవా ట్రయల్ కోర్టు సాక్ష్యాధారాల లేవంటూ ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, ఈ తీర్పుపై గోవా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు విచారణలో ప్రొసిక్యూషన్ ఆధారాలు బలంగా ఉన్నాయని తేలడంతో పాటు విచారణ కోర్టు తీర్పును తప్పుబడుతూ 10 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. మరోవైపు, నేర తీవ్రత దృష్ట్యా ఈ శిక్షను యావజ్జీవ కారాగారంగా మార్చాలని గోవా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో సవాలు పిటిషన్ వేసింది. ప్రస్తుతం కోర్టుకు లొంగిపోయిన తేజ్‌పాల్‌ను పోలీసులు జైలుకు తరలించగా, సుప్రీంకోర్టులో రాబోయే రోజుల్లో జరగనున్న విచారణ ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో అత్యంత కీలక ఘట్టంగా మారనుంది.