ఢిల్లీ హోటల్‌లో ఎయిర్ ఇండియా పైలట్ ఆకస్మిక మృతి

ఢిల్లీ హోటల్‌లో ఎయిర్ ఇండియా పైలట్ ఆకస్మిక మృతి

Air India pilot dies suddenly in Delhi hotel
  • ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఎయిర్ ఇండియా పైలట్ గుండెపోటుతో మృతి
  • లేఓవర్ విశ్రాంతిలో ఉండగా వెలుగులోకి వచ్చిన ఘటన
  • బోయింగ్ 787 విమానం నడిపేందుకు శిక్షణ పొందుతున్న పైలట్
  • కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన ఎయిర్ ఇండియా
  • గతంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేసినట్టు గుర్తింపు
ఎయిర్ ఇండియా సంస్థలో విషాద ఛాయలు అలముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక హోటల్‌లో బస చేసిన ఓ పైలట్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని, లేఓవర్‌లో భాగంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన కన్నుమూశారని ఎయిర్ ఇండియా శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ముంబైకి చెందిన సదరు పైలట్ గతంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వహించారు. కొన్ని నెలల క్రితమే ఆయన ఎయిర్ ఇండియాకు మారారు. ప్రస్తుతం సుదూర ప్రయాణాలు చేసే బోయింగ్ 787 విమానాలను నడిపేందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ (కన్వర్షన్ ట్రైనింగ్) పొందుతున్నారు. ఈ శిక్షణ నిమిత్తమే ఢిల్లీకి వచ్చిన ఆయన, అక్కడి ఒక హోటల్‌లో బస చేశారు.

శుక్రవారం సాయంత్రం ఆయన సోదరుడు ఫోన్ చేయగా, పైలట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. హోటల్ మేనేజర్ మాస్టర్ కీతో గది తలుపులు తెరిచి చూడగా, సదరు పైలట్ అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రవీకరించారు.

ఈ ఘటనపై వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ సిబ్బందిలో ఒకరిని కోల్పోవడం అత్యంత బాధాకరమని ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని యాజమాన్యం భరోసా ఇచ్చింది. శనివారం ఉదయం విధి నిర్వహణలో భాగంగా ఆయన ఒక విమానాన్ని నడపాల్సి ఉండగా, ఇంతలోనే ఈ విషాదం జరగడం విచారకరం.
Advertisement
Air India Pilot
Delhi hotel death
Sudden heart attack
Boeing 787 conversion training
Air India news

More Telugu News