వినాయక మండపాలకు ఉచిత విద్యుత్: సీఎం రేవంత్ రెడ్డి

వినాయక మండపాలకు ఉచిత విద్యుత్: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Announces Free Electricity for Vinayaka Mandaps
  • గణేశ్ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి
  • మండపాల నిర్వహకులు పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని సూచన
  • నిమజ్జనాలు చేసే చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశం

వినాయక చవితి ఉత్సవాలను ఎక్కడా చిన్నపాటి అవాంఛనీయ సంఘటనకూ తావులేకుండా, వైభవంగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. పండుగ వేళ భక్తులకు, మండప నిర్వాహకులకు ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. ఉత్సవ కమిటీలు, ప్రజాప్రతినిధులు, పోలీసు, మున్సిపల్ ఉన్నతాధికారులతో సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన... పండుగ నిర్వహణపై సమగ్ర సమీక్ష జరిపారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలోనే గణేశ్ మండపాలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. నిర్వాహకులు అధికారులకు ముందస్తుగా దరఖాస్తు చేసుకుని ఈ ఉచిత విద్యుత్ సదుపాయాన్ని పొందొచ్చని సూచించారు. "స్థానిక పోలీస్ స్టేషన్లలో మండపాల సమాచారం ఇవ్వండి. దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే కాకుండా, మన భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేయడానికి వీలవుతుంది" అని ఆయన స్పష్టం చేశారు.


చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేస్తూ... "మనం అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మ ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నామో, గణేశ్ నిమజ్జనాలకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద క్రేన్లు పెట్టేందుకు వీలుగా చెరువు గట్లు, పరిసరాలను సిద్ధం చేయాలి" అని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 24 గంటలూ పర్యవేక్షణ ఉండాలని, మున్సిపల్, పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చెప్పారు.


"హైదరాబాద్ ప్రశాంతంగా, సురక్షితంగా ఉంటేనే మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అందుకే శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మండపాల నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement
Revanth Reddy
Ganesh Chaturthi 2024
Free Electricity for Ganesh Mandaps
Telangana Government
Ganesh Nimajjanam Arrangements
Hyderabad Police Security

More Telugu News