ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత.. భారత్‌కు డబుల్ టెన్షన్!

ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత.. భారత్‌కు డబుల్ టెన్షన్!

Red Sea tension creates double tension for India
  • హౌతీల చేతికి కీలకమైన బాబ్ ఎల్-మండెబ్ జలసంధి
  • 50 శాతానికి పైగా  భారత్ చమురు దిగుమతుల్లో ఈ మార్గం ద్వారానే
  • యూరప్‌కు భారత ఎగుమతులకు తీవ్ర ఆటంకాలు
  • పెరగనున్న రవాణా ఖర్చులు, పెట్రోల్, డీజిల్ ధరలు
  • హర్మూజ్‌తోపాటు భారత్‌కు మరో ముప్పు
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో కీలక ప్రాంతాలపై పట్టు సాధిస్తుండటం భారత్‌కు కొత్త ఆందోళన కలిగిస్తోంది. వ్యూహాత్మకమైన మోఖా పోర్టును స్వాధీనం చేసుకున్న హౌతీలు, ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన బాబ్ ఎల్-మండెబ్ జలసంధి వైపు వేగంగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఈ తాజా పరిణామం భారత్‌కు "డబుల్ చోక్ పాయింట్" ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. ఇది దేశ ఇంధన భద్రత, వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

"గేట్ ఆఫ్ టియర్స్"గా పిలిచే బాబ్ ఎల్-మండెబ్ జలసంధి, ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలుపుతుంది. సూయజ్ కెనాల్ ద్వారా ఆసియా-యూరప్ మధ్య జరిగే వాణిజ్యానికి ఇదే ప్రధాన మార్గం. జూన్ 2026 నాటి గణాంకాల ప్రకారం, ఈ మార్గం గుండా రోజుకు సుమారు 7.4 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం రవాణా అవుతోంది. సౌదీ అరేబియా కూడా తన చమురు ఎగుమతుల్లో అధిక భాగాన్ని ఈ మార్గంలోనే మళ్లించింది.

ఈ పరిణామాల ప్రభావం భారత్‌పై చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కెప్లర్ డేటా ప్రకారం, భారత్ దిగుమతి చేసుకునే మొత్తం ముడిచమురులో 50 శాతానికి పైగా ఇదే మార్గం గుండా వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్యా, సౌదీ అరేబియా నుంచి వచ్చే చమురు రవాణాపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది. హౌతీలు ఈ జలసంధిపై నియంత్రణ సాధిస్తే, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో పాటు, రవాణా, బీమా ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి.

ఇది కేవలం దిగుమతులకే పరిమితం కాదు. భారత్ నుంచి యూరప్‌కు వెళ్లే ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మా, టెక్స్‌టైల్స్ వంటి ఎగుమతులపైనా ప్రభావం పడుతుంది. ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా చుట్టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గంలో వెళ్లాలంటే ప్రయాణ సమయం, ఖర్చులు రెండూ పెరుగుతాయి. ఒకవైపు హర్మూజ్, మరోవైపు బాబ్ ఎల్-మండెబ్ వద్ద ఉద్రిక్తతలు పెరగడం భారత్ శక్తి భద్రత, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సవాల్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Houthis
India
Red Sea Crisis
Bab el Mandeb Strait
Energy Security
Oil Imports

More Telugu News