నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వుల జారీ
- ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్ గా నియమితులైన నాగబాబు
- కేబినెట్ ర్యాంక్‌తో పాటు సంబంధిత వేతన, భత్యాలను నిర్దేశిస్తూ జీవో జారీ
- రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించడమే ఏపీ గ్రీన్ కమిటీ లక్ష్యం
జనసేన నేత, శాసనమండలి సభ్యుడు నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని 'ఏపీ-గ్రీన్' (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా ఆయనను రెండేళ్ల కాలానికి నియమించిన ప్రభుత్వం... తాజాగా ఆయనకు కేబినెట్ ర్యాంక్‌తో పాటు సంబంధిత వేతన, భత్యాలను నిర్దేశిస్తూ సాధారణ పరిపాలన శాఖ ద్వారా అధికారిక జీవోను విడుదల చేసింది.
ఆర్థిక శాఖ సమ్మతితో వెలువడిన ఈ ఉత్తర్వుల ప్రకారం... నాగబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి కేబినెట్ స్థాయి వేతన, భత్యాలు వర్తించనున్నాయి. పర్యావరణ పరిరక్షణ, అటవీకరణ, హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా 'వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047' విజన్‌లో 50 శాతం పచ్చదనం సాధించడమే ధ్యేయంగా ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పనిచేస్తుంది. ఈ క్రమంలో ఈ కమిటీ వ్యవహారాలు, వివిధ శాఖల సమన్వయం, జిల్లాల వారీగా కార్యక్రమాల పర్యవేక్షణ వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.