ఫాంహౌస్ నుంచే దళితులపై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు: అద్దంకి దయాకర్

ఫాంహౌస్ నుంచే దళితులపై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు: అద్దంకి దయాకర్

Addanki Dayakar says plans to attack Dalits are being made from KCR farmhouse
  • కాంగ్రెస్ శ్రేణులు డప్పు కొడితే కేసీఆర్ ఫాంహౌస్ మైలపడిందా? అని దయాకర్ మండిపాటు
  • శుద్ధి చేయడం ఎంతవరకు సబబు? అని ప్రశ్న
  • రేవంత్ రెడ్డిపై ఉన్న కడుపుమంటతో అసెంబ్లీని అభాసుపాలు చేస్తున్నారని విమర్శ

అసెంబ్లీ సమావేశాల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ కక్షపూరిత కుట్రలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


"కాంగ్రెస్ శ్రేణులు డప్పులు కొడితే ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ ఏమైనా మైలపడిందా? దాన్ని శుద్ధి చేయడం ఎంతవరకు సమంజసం?" అని బీఆర్ఎస్ నాయకులను ఆయన సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు ప్రజాసమస్యలు పట్టవని, కేవలం రేవంత్ రెడ్డిపై ఉన్న కడుపుమంటతోనే అసెంబ్లీని అభాసుపాలు చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.


దళిత వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి తీవ్ర పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తూ ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ వద్ద నిర్వహించిన 'చావు డప్పు' నిరసనపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని దయాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చట్టసభలు, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, ఫాంహౌస్ నుంచే దళితులపై దాడులకు, ప్రభుత్వంపై కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. వారే తప్పులు చేసి, పైగా ప్రభుత్వంపై నిందలు వేయడం బీఆర్ఎస్‌కే చెల్లిందని, వారి నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

Advertisement
Addanki Dayakar
K Chandrashekar Rao
BRS Party
Erravelli Farmhouse
Gaddam Prasad Kumar
Telangana Assembly

More Telugu News