మార్కెట్‌లో చమురు ‘మంటలు’.. సెన్సెక్స్‌ 813 పాయింట్లు పతనం

మార్కెట్‌లో చమురు ‘మంటలు’.. సెన్సెక్స్‌ 813 పాయింట్లు పతనం

Sensex crashes 800 points as oil prices surge
  • 203 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • వరుసగా మూడో సెషన్‌లో మార్కెట్లు కుదేలు
  • 100 డాలర్లకు చేరిన బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర
  • ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు నమోదు
  • ఆందోళనలు పెంచిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ముదరడం, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువ కావడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడో సెషన్‌లోనూ సూచీలు పతనమయ్యాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచాయి.

సెన్సెక్స్‌ 813.35 పాయింట్లు నష్టపోయి 74,764.23 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203.60 పాయింట్లు క్షీణించి 23,431.50 వద్ద ముగిసింది. నిఫ్టీకి 23,550-23,600 స్థాయి తక్షణ నిరోధంగా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. 23,600 పైన నిలకడగా కొనసాగితే 23,700-23,800 దిశగా కోలుకునే అవకాశం ఉందన్నారు. దిగువన 23,400 స్థాయి తక్షణ మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు.

ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3 శాతానికి పైగా పడిపోయింది. రియల్టీ సూచీ కూడా నష్టాల్లోనే ముగిసింది. మరోవైపు మెటల్‌ సూచీ కొంత మెరుగ్గా రాణించి మార్కెట్‌ పతనాన్ని కొద్దిగా అడ్డుకుంది.

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లపైనా అమ్మకాల ప్రభావం పడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 0.51 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ సూచీ 0.48 శాతం నష్టపోయాయి.

ముడిచమురు ధరలు పెరగడం మార్కెట్‌ వర్గాల్లో ఆందోళన పెంచింది. భారత్‌ భారీగా క్రూడ్‌ దిగుమతి చేసుకునే దేశం కావడంతో ధరలు పెరిగితే దిగుమతి బిల్లు, ఉత్పత్తి వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ద్రవ్యోల్బణంపై కూడా ఒత్తిడి పెరగొచ్చన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. బుధవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఓ దశలో బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి బలహీనత, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని నిపుణులు తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై స్పష్టత వచ్చే వరకు మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Advertisement
Sensex
Brent Crude Oil
Stock Market Crash
IT Sector Stocks
US Iran Conflict
Nifty 50 Update

More Telugu News