తిరుమల పర్యటనలో ఉన్న మల్లారెడ్డిని కూడా సస్పెండ్ చేశారు: తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్
- సభలో లేని వారిని కూడా సస్పెండ్ చేశారంటూ తలసాని మండిపాటు
- 22-ఏ వంటి అంశాలపై చర్చ జరగకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
- స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్య
తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వేటుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని తీవ్రంగా అభాసుపాలు చేస్తోందని, ప్రజా సమస్యలు, కీలకమైన జీవో 97, 22-ఏ వంటి అంశాలపై చర్చ జరగకుండా తప్పించుకునేందుకే విపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తోందని ఆరోపించారు.
సభకు రాకుండా తిరుమల పర్యటనలో ఉన్న మల్లారెడ్డితో పాటు, సభలో లేని పద్మారావు గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కేటీఆర్, గంగుల కమలాకర్ పేర్లను కూడా సస్పెన్షన్ జాబితాలో చేర్చడం శాసనసభా చరిత్రలోనే హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. శాసనసభా వ్యవహారాల మంత్రి చదివిన జాబితా ఒకటైతే, స్పీకర్ ప్రకటించిన పేర్లు మరో విధంగా ఉన్నాయని తప్పుబట్టారు.
తెలంగాణ సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుకుంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఎలాంటి సస్పెన్షన్ వేటు వేయకుండా సభలోనే కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటే బీఆర్‌ఎస్‌కు ఎంతో గౌరవం ఉందని, ఆయనపై గౌరవంతోనే నాడు స్పీకర్ ఎన్నికలో అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు నిత్యం 'దళిత స్పీకర్' అని వర్గీకరిస్తూ ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐ ఫేక్ ఫొటోలతో బీఆర్‌ఎస్ నేతలను నెగెటివ్‌గా వైరల్ చేసే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళుతుంటే తమ నేతలను అరెస్ట్ చేయడం, జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో బీఆర్‌ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడటం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని తలసాని ధ్వజమెత్తారు.