'నిజం గెలిచింది' కార్యక్రమానికి లోకేశ్ పిలుపు

'నిజం గెలిచింది' కార్యక్రమానికి లోకేశ్ పిలుపు

Nara Lokesh calls for Nijam Gelichindi program to mark Chandrababu Naidu arrest anniversary
  • కార్యకర్తల త్యాగాల వల్లే అధికారం.. వారిని గౌరవించాలన్న లోకేశ్ 
  • పార్టీ, పర్సనల్, ప్రభుత్వం.. నేతలకు 3-పీ మంత్రం
  • కార్యకర్తల పోరాటాల వల్లే అధికారంలోకి వచ్చామని స్పష్టీకరణ
  • వైసీపీ దుష్ప్రచారాలను ఐక్యంగా తిప్పికొట్టాలని సూచన
  • కలిసికట్టుగా రాష్ట్రాన్ని, పార్టీని ముందుకు నడిపిద్దామని పిలుపు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి రేపటికి (సెప్టెంబర్ 10) మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్‌షిప్ కాంక్లేవ్ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ‘పార్టీ, పర్సనల్, ప్రభుత్వం’ అనే మూడు ‘పీ’లను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, ప్రభుత్వ పథకాలు, పనుల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలని, మానవత్వంతో ప్రజలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు.

డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్ అని, ఆయన హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని లోకేష్ విమర్శించారు. తాము 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, ఈ ఐదేళ్లలో 30,000 పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఐక్యంగా తిప్పికొట్టాలని నేతలకు సూచించారు.

చంద్రబాబును 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో బంధించారని, ఆయన ఏ తప్పు చేయలేదని కోర్టు, ఈడీ క్లీన్‌చిట్ ఇచ్చాయని లోకేశ్ గుర్తుచేశారు. దీనికి గుర్తుగా రేపు పార్టీ కార్యాలయాలు, ఇళ్ల వద్ద 53 దీపాలు వెలిగించి ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. పార్టీలో ఈగోలు, అహంకారాలకు తావులేదని, ఇది ‘టీడీపీ 3.0 వెర్షన్’ అని, అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని, పార్టీని ముందుకు నడిపించాలని కోరారు.
Advertisement
Nara Lokesh
Chandrababu Naidu
Nijam Gelichindi program
TDP Leadership Conclave
Andhra Pradesh politics
Telugu Desam Party

More Telugu News