జన్వాడ అక్రమ వెంచర్‌పై ఉక్కుపాదం.. 60 ఎకరాల లేఅవుట్ కూల్చివేత

జన్వాడ అక్రమ వెంచర్‌పై ఉక్కుపాదం.. 60 ఎకరాల లేఅవుట్ కూల్చివేత

HMDA demolishes 60 acre illegal layout in Janwada
  • 111 జీవో నిబంధనలను ఉల్లంఘించడంతో అధికారుల కఠిన చర్యలు
  • హెచ్‌ఎండీఏ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆపరేషన్
  • క్లబ్‌హౌస్ పిల్లర్లు, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను ధ్వంసం చేసిన అధికారులు
  • సీఎంసీ పరిధిలో మరో 16 అక్రమ కట్టడాలను కూడా తొలగింపు
హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లి మండలం జన్వాడలో ఏర్పాటు చేసిన భారీ అక్రమ వెంచర్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. గండిపేట జలాశయ పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను ఉల్లంఘిస్తూ సుమారు 60 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ లేఅవుట్‌ను సోమవారం హెచ్‌ఎండీఏ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులు సంయుక్తంగా కూల్చివేశారు.

ఈ కూల్చివేత ఆపరేషన్‌లో భాగంగా, వెంచర్‌లో క్లబ్‌హౌస్ కోసం నిర్మిస్తున్న పిల్లర్లను, కాంక్రీట్ నిర్మాణాలను ఎక్స్‌కవేటర్లతో నేలమట్టం చేశారు. అలాగే, అక్రమంగా వేసిన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, బాక్స్ డ్రెయిన్లను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్, సీఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అక్రమాలను నిర్ధారించుకున్నారు. అనంతరం రియల్టర్లకు నోటీసులు జారీ చేసి, తహసీల్దార్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు.

111 జీవో పరిధిలో అనుమతులు లేకుండా ఎవరు నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అక్రమ కట్టడాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికారుల చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన పరిధిలోని ఇతర ప్రాంతాల్లోనూ అనధికార నిర్మాణాలపై చర్యలను ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో కలిపి మొత్తం 16 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. మరో 15 నిర్మాణాలను గుర్తించి, ఒకదాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Advertisement
HMDA
Janwada Illegal Layout Demolition
GO 111 Violation
Cyberabad Municipal Corporation
Shankarpally Real Estate
Hyderabad Illegal Constructions

More Telugu News