ప్రైవేటీకరణపై వదంతులకు చెక్.. ఇస్రో ఉద్యోగులకు చైర్మన్ నారాయణన్ భరోసా

ప్రైవేటీకరణపై వదంతులకు చెక్.. ఇస్రో ఉద్యోగులకు చైర్మన్ నారాయణన్ భరోసా

ISRO Chairman V Narayanan reassures employees over privatization rumors
  • ఇస్రోను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్న చైర్మన్ వి. నారాయణన్ 
  • ప్రైవేటు భాగస్వామ్యం అంతరిక్ష రంగ విస్తరణలో భాగమేనని వెల్లడి
  • ఏటా 50 రాకెట్ ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఇస్రో
  • భవిష్యత్ ప్రాజెక్టుల్లో ఇస్రో, ప్రైవేటు రంగం కలిసి పనిచేస్తాయని ఇన్-స్ఫేస్ వెల్లడి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందన్న ప్రచారాన్ని ఆ సంస్థ చైర్మన్ వి. నారాయణన్ తీవ్రంగా ఖండించారు. ఇస్రో ఎప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని, దానిని ప్రైవేటుపరం చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని సోమవారం ఆయన స్పష్టం చేశారు. ఈ వార్తలపై ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనలు సహేతుకమైనవేనని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

బెంగళూరులో జరిగిన 9వ స్పేస్ ఎక్స్‌పో (BSX) ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇస్రోలో తయారీ, నిర్వహణ కార్యకలాపాలను ప్రైవేటు రంగానికి బదిలీ చేస్తున్నారనే వార్తలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 4న తొమ్మిది ఉద్యోగ సంఘాలు రాసిన లేఖపై ఆయన స్పందించారు. ఇస్రోలో ప్రస్తుతం 20 వేల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 8 వేల మంది శాస్త్రవేత్తలని తెలిపారు. ఏటా సుమారు 150 మంది ఉద్యోగులు రాజీనామా చేయడం ఏ సంస్థలోనైనా సాధారణ పరిణామమేనని ఆయన పేర్కొన్నారు.

గత ఆరేళ్లుగా అంతరిక్ష రంగంలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగానే ప్రైవేటు కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తున్నామని నారాయణన్ వివరించారు. ఇది భారత అంతరిక్ష రంగాన్ని మరింత విస్తరించేందుకే తప్ప, ప్రైవేటీకరణ కాదని ఆయన స్పష్టం చేశారు. రానున్న కాలంలో ఏటా 50 రాకెట్ ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనిని సాధించగలమనే ధీమాను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్-స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా మాట్లాడుతూ.. అంతరిక్ష రంగ విస్తరణతో ప్రపంచ మార్కెట్‌లో భారత్ వాటా గణనీయంగా పెరుగుతుందని అన్నారు. భారత అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4, మానవసహిత అంతరిక్ష యాత్ర వంటి భవిష్యత్ ప్రాజెక్టులలో ఇస్రో, ప్రైవేటు రంగం సమన్వయంతో కలిసి పనిచేస్తాయని ఆయన వెల్లడించారు.
Advertisement
ISRO
V Narayanan
ISRO privatization news
Bengaluru Space Expo
Indian space sector reforms
Pawan Goenka

More Telugu News