ప్రైవేటీకరణ అంటూ కథనాలు.. క్లారిటీ ఇచ్చిన ఇస్రో

ప్రైవేటీకరణ అంటూ కథనాలు.. క్లారిటీ ఇచ్చిన ఇస్రో

ISRO Clarifies Reports on Privatization Rumors
  • ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన భారత అంతరిక్ష సంస్థ
  • మా పాత్ర తగ్గదు, మరింత కీలకమవుతుందని స్పష్టీకరణ
  • అధునాతన పరిశోధనలపై దృష్టి పెడతామన్న ఇస్రో
  • ప్రైవేట్ రంగ భాగస్వామ్యం సామర్థ్యాన్ని పెంచడానికేనని వెల్లడి
  • 2035 నాటికి భారతీయ అంతరిక్ష్ స్టేషన్ ఏర్పాటు లక్ష్యం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటీకరిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న ఊహాగానాలకు సంస్థ ఆదివారం పూర్తిస్థాయిలో తెరదించింది. ఇస్రోను ప్రైవేటీకరించే ఆలోచన లేదని, దేశ అంతరిక్ష ప్రయోగాలలో దాని ప్రాధాన్యం ఎప్పటికీ తగ్గదని స్పష్టం చేసింది. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది.

ఇస్రో భవిష్యత్ పాత్రపై కొన్ని మీడియా సంస్థలు అసత్యాలు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని, ఈ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని ఇస్రో పేర్కొంది. "ఇస్రోను ప్రైవేటీకరించరు, దాని ప్రాముఖ్యాన్ని తగ్గించరు. అత్యాధునిక అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధి, వ్యూహాత్మక ప్రయోగాలు, అంతరిక్ష విజ్ఞానం, అన్వేషణ వంటి కీలక రంగాలలో ఇస్రో దేశానికి ప్రధాన సంస్థగా కొనసాగుతుంది" అని ఆ ప్రకటనలో తేల్చిచెప్పింది.

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వెనుక ఉద్దేశం ఇస్రో పాత్రను తగ్గించడం కాదని, మరింత ఉన్నతమైన లక్ష్యాలపై దృష్టి సారించేలా చేయడమేనని వివరించింది. 2020లో ప్రారంభమైన సంస్కరణలు, 2023 భారత అంతరిక్ష విధానం ద్వారా దేశంలో బలమైన, ప్రపంచంతో పోటీపడగల అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని తెలిపింది. దీనివల్ల ఇస్రో ప్రాధాన్యం తగ్గదని, భారత అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ స్వరూపం, సామర్థ్యం విస్తరిస్తాయని పేర్కొంది.

సాంకేతికంగా అభివృద్ధి చెందిన, పునరావృతమయ్యే పనులను పరిశ్రమలకు అప్పగించడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది తమ సమయాన్ని అధునాతన పరిశోధనలు (ఆర్ అండ్ డీ), కొత్త తరం టెక్నాలజీలు, సంక్లిష్టమైన జాతీయ ప్రాజెక్టులపై కేంద్రీకరించగలరని ఇస్రో తెలిపింది. ఇది "ఇస్రో నేతృత్వంలోని జాతీయ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ"కు నాంది పలుకుతుందని వివరించింది.

భవిష్యత్ లక్ష్యాలు ఇవే..
భవిష్యత్తులో ఇస్రో పాత్ర మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా, మానవసహిత అంతరిక్ష యాత్రలు (గగన్‌యాన్), కొత్త తరం ప్రయోగ వాహనాలు, చంద్రుడు, ఇతర గ్రహాలపై పరిశోధనలు, 2035 నాటికి 'భారతీయ అంతరిక్ష్ స్టేషన్' ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపడం వంటి భారీ లక్ష్యాలపై ఇస్రో దృష్టి పెడుతుంది.

ప్రస్తుతం 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యం. ఈ స్థాయి వృద్ధిని కేవలం ప్రభుత్వ వనరులతో సాధించడం అసాధ్యమని, దీనికి ప్రైవేట్ పెట్టుబడులు, పారిశ్రామిక సామర్థ్యం, ప్రపంచ మార్కెట్ అవసరమని ఇస్రో స్పష్టం చేసింది. 2020లో కొన్ని మాత్రమే ఉన్న స్పేస్ స్టార్టప్‌లు, నేడు 450కి పైగా పెరగడమే ఈ సంస్కరణల విజయానికి నిదర్శనమని పేర్కొంది.
Advertisement
ISRO
ISRO privatization news
Indian space research
Gaganyaan mission
Indian space economy
Indian Space Policy

More Telugu News