2040 వరకు తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం: మహేశ్ గౌడ్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన మధ్య తేడాపై చర్చకు సిద్ధమన్న మహేశ్ గౌడ్
- కేటీఆర్ సోషల్ మీడియాలో క్షణికానందం పొందుతున్నారని ఎద్దేవా
- తెలంగాణ మట్టిలో బీఆర్ఎస్ అనే మొక్క వాడిపోయిందని వ్యాఖ్య
తెలంగాణ ప్రజల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తాము పోరాటాలు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ రాజీనామా చేయాలంటూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో మాట్లాడిన ఆయన, వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనకు, పదేళ్ల బీఆర్‌ఎస్ దుర్మార్గానికి మధ్య తేడాపై ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, బీఆర్‌ఎస్ నాయకులకు ఆ సవాల్‌ను స్వీకరించే ధైర్యం ఉందా? అని నిలదీశారు. గతంలో కేసీఆర్ చేసిన కొండంత అప్పులను మోస్తూనే తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తుచేశారు.
కేటీఆర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమై క్షణికానందం పొందుతున్నారని, ఆయన చదువుకున్నప్పటికీ సంస్కారం లేని రీతిలో ప్రవర్తిస్తున్నారని మహేశ్ గౌడ్ దుయ్యబట్టారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ గద్దర్, అందెశ్రీ, పూలే, సర్దార్ సర్వాయి పాపన్న వంటి మహనీయులను గౌరవించిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు. కేసీఆర్ తన కొడుకు, అల్లుడి రాజకీయ ప్రయోజనాల కోసం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడటంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ చేతకాకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు ఏలే శక్తి కాంగ్రెస్‌కు ఉందని, తెలంగాణలో 2040 వరకు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని తేల్చిచెప్పారు. తెలంగాణ మట్టిలో బీఆర్ఎస్ అనే మొక్క ఇప్పటికే వాడిపోయిందని, బీజేపీ అనే మొక్క అసలు మొలకెత్తనే మొలకెత్తదని ఆయన ఎద్దేవా చేశారు.