ధర్నాలు మాని అసెంబ్లీకి రండి.. సమాధానం చెప్పేందుకు మేం సిద్ధం: శ్రీధర్‌బాబు
- బీఆర్ఎస్ నాయకత్వం దిశానిర్దేశం కోల్పోయిందన్న శ్రీధర్ బాబు
- ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని వెల్లడి
- బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శ
తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకత్వం పూర్తిగా దిశానిర్దేశం కోల్పోయి పక్కదారి పడుతోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. రోడ్లపై అనవసర ధర్నాలు, మీడియా ముందు మాట్లాడటం మాని నేరుగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తాము ప్రతీదానికీ సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత జవాబుదారీతనంతో పనిచేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్కరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారని, కానీ తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ రేషన్ కార్డులతో పాటు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని గుర్తుచేశారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని బీఆర్‌ఎస్, బీజేపీ నేతల కుటుంబ సభ్యులు కూడా వినియోగించుకోవడం లేదా? అని శ్రీధర్‌బాబు నిలదీశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కావాలనే కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నాయని, ఈ దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని హితవు పలికారు. రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేటీఆర్, హరీశ్‌రావులు.. గతంలో వారి ప్రభుత్వ హయాంలో ఇవే హామీలపై కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించలేకపోయారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులోనూ వీధుల్లోనే మిగిలిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.