సీఎం ఇంటి వద్ద ఉద్యోగ సంఘాల నేతల రచ్చ.. బాహాబాహీకి దిగిన నేతలు

Employee union leaders ruckus at CM residence leaders clash physically
  • సీఎం ఇంటి వద్ద ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఘర్షణ
  • ఏపీ జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ సంఘం మధ్య తోపులాట
  • ఒకరి ప్రెస్ మీట్‌ను మరొకరు అడ్డుకోవడంతో వివాదం
  • ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత
  • సీనియర్ నేతల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
అమరావతిలో ఉద్యోగ సంఘాల నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం ముగిసిన అనంతరం, ఉండవల్లిలోని సీఎం నివాసం వెలుపల ఇరు సంఘాల నేతలు బాహాబాహీకి దిగారు. ఏపీ జేఏసీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుల మధ్య చోటుచేసుకున్న తీవ్ర వాగ్వివాదం, తోపులాటతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సీఎంతో భేటీ అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతుండగా.. అదే సమయంలో ఏపీ జేఏసీ నాయకులు అక్కడికి చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేశారు. సూర్యనారాయణ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఇది కాస్తా ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి పరస్పరం తోపులాటకు దారితీసింది.

ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సూర్యనారాయణ, "నువ్వు అరిచినంతసేపు ఇక్కడి నుంచి కదలను. ఏం చేసుకుంటావో చేసుకో. దశాబ్దాలుగా నేను ఉద్యోగ సంఘాల్లో ఉన్నాను" అంటూ జేఏసీ నేతలపై మండిపడ్డారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో ఏపీ జేఏసీ ఛైర్మన్ విద్యాసాగర్‌తో పాటు ఇతర సీనియర్ నాయకులు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Advertisement
Suryanarayana
AP JAC
Chandrababu Naidu
Amaravati
Employee Union Clash
AP Government Employees Association

More Telugu News