తెలంగాణలో టీసీఎస్ భారీ పెట్టుబడి.. రూ.70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్

TCS massive investment in Telangana 70000 crore AI Data Center
  • హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్
  • రూ.70 వేల కోట్ల పెట్టుబడితో టీసీఎస్ అనుబంధ సంస్థ ఏర్పాటు
  • ఈ ప్రాజెక్టు ద్వారా 7 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
  • ఐదు రాష్ట్రాలతో పోటీపడి ప్రాజెక్టును సాధించిన తెలంగాణ ప్రభుత్వం
  • సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనతో సాకారమైన ప్రాజెక్ట్
తెలంగాణ రాష్ట్రం మరో భారీ పెట్టుబడిని ఆకర్షించింది. దేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముందుకొచ్చింది. టీసీఎస్ అనుబంధ సంస్థ 'హైపర్‌వోల్ట్' రూ.70,000 కోట్ల పెట్టుబడితో భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. దీని ద్వారా దాదాపు 7,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం, హైపర్‌వోల్ట్ సంస్థ ప్రతినిధుల మధ్య ఒప్పంద పత్రాల మార్పిడి జరిగింది.

ఈ ప్రాజెక్టు తెలంగాణకు రావడం చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో జరిపిన సమావేశంలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టాలని కోరానని, ఆ కల ఇప్పుడు నెరవేరిందని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా విధానాలు మారవని, పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికత ఎన్ని మార్పులు తెచ్చినా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటి బ్లూకాలర్ ఉద్యోగాలకు ఢోకా ఉండదని, స్కిల్ యూనివర్సిటీ ద్వారా అలాంటి నైపుణ్యాలను ప్రోత్సహిస్తామని తెలిపారు.

హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో 264 ఎకరాల విస్తీర్ణంలో ఒక గిగావాట్ సామర్థ్యంతో ఈ ఏఐ డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. 18 నుంచి 24 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని కంపెనీ ప్రకటించగా, 2028 జూన్ 2 నాటికి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పర్యావరణ హితంగా గ్రీన్ ఎనర్జీతో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఐదు రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తెలంగాణ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును దక్కించుకోవడం విశేషం. 
Advertisement
TCS
Hyderabad AI Data Center
Telangana Government
Revanth Reddy
Hypervolt Investment
Bharat Future City

More Telugu News