సీఎం రేవంత్ ను దూషించలేదు.. అప్పుడు అన్నది ఒకట్రెండు విషయాల్లోనే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రేవంత్ తో తనకు వ్యక్తిగత వైరం లేదన్న రాజగోపాల్ రెడ్డి
- తన నిజయకవర్గానికి కొడంగల్ స్థాయిలోనే నిధులు వచ్చాయని ప్రశంస
- సీఎం బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలతో వెళతానని వెల్లడి
కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధించే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా యు-టర్న్ తీసుకున్నారు. తాను రేవంత్ రెడ్డిని ఎప్పుడూ దూషించలేదని, కేవలం ఒకట్రెండు అంశాల్లో మాత్రమే అభిప్రాయ భేదాలు వచ్చాయని క్లారిటీ ఇచ్చారు.
రేవంత్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని స్పష్టం చేసిన ఆయన, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్, డిప్యూటీ సీఎం నియోజకవర్గం మధిర స్థాయిలోనే తన మునుగోడు నియోజకవర్గానికి కూడా రూ. 2 వేల కోట్ల నిధులు వచ్చాయని ప్రశంసల జల్లు కురిపించారు. త్వరలో జరగబోయే సీఎం బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలతో తరలివెళతానని చెప్పారు.