ఉపాధ్యాయ దినోత్సవం రోజున సచిన్ టెండూల్కర్ కీలక ప్రకటన

Sachin Tendulkar makes key announcement on Teachers Day
  • తండ్రి, ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ పేరుతో సచిన్ కొత్త ఫెలోషిప్ ప్రారంభం
  • వైద్య విద్యార్థులకు ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ, ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం
  • తన ప్రయాణం క్రికెట్ గ్రౌండ్‌లో కాదు, ఇంట్లోనే మొదలైందని వెల్లడి
  • ఓటమి పర్వాలేదు కానీ మోసం చేయొద్దని తండ్రి చెప్పిన మాటలు గుర్తుచేసుకున్న సచిన్
  • విద్య ద్వారా అవకాశాలు సృష్టించి, సమాజ సేవకు ఉపయోగించడమే లక్ష్యమని స్పష్టీకరణ
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన తండ్రి, తన మొదటి గురువు అయిన ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్‌ను స్మరించుకున్నారు. ఆయన స్మారకార్థం 'ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్'ను ప్రకటించి తన తండ్రికి ఘన నివాళి అర్పించారు. విద్య ద్వారా లభించిన అవకాశాలను సమాజ సేవకు ఉపయోగించాలన్న తన తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సచిన్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు.

"నా జీవిత ప్రయాణం గురించి ఆలోచించినప్పుడు, నాకు క్రికెట్ మైదానం గానీ, కోచ్ గానీ గుర్తుకురారు. మా ఇల్లే నా కళ్ల ముందు మెదులుతుంది. నా కుటుంబం బయట నా పేరు ఎవరికీ తెలియకముందే, క్రికెట్‌పై నాకున్న ప్రేమను, అది నాకెంత ముఖ్యమో మా నాన్న గుర్తించారు. ఈ ప్రయాణం నన్ను ఎక్కడికి తీసుకెళుతుందదో ఆయనకు కచ్చితంగా తెలియదు. కానీ, దాన్ని కొనసాగించే స్వేచ్ఛను నాకు ఇచ్చారు.

మా నాన్న రమేశ్ టెండూల్కర్ ఒక రచయిత, కవి, ప్రొఫెసర్. కానీ వీటన్నింటికంటే నాకు, మరెందరికో ఆయన ఒక గొప్ప మార్గదర్శి. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తూనే, విజయం కోసం వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ పణంగా పెట్టకూడదని గుర్తుచేశారు. "ఓడిపోవడం తప్పు కాదు, కానీ మోసం చేయడం నేరం. ఎప్పుడూ అడ్డదారులు వెతకొద్దు" అని నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు నా జీవితాంతం గుర్తుంటాయి.

ఆనాడు నేను కేవలం క్రికెట్ ఆడటాన్ని ఇష్టపడే ఒక బాలుడిని. కానీ నాన్న నాలో అంతకుమించి ఏదో చూశారు. నేను ఏమవ్వాలో ఆయన నిర్ణయించలేదు. బదులుగా, నా మార్గాన్ని నేనే కనుగొనేందుకు అవసరమైన స్వేచ్ఛను, మద్దతును ఇచ్చారు. గొప్ప గురువు లేదా మార్గదర్శి చేసే పని అదే. మనలోని సామర్థ్యాన్ని మనకంటే ముందే వారు గుర్తిస్తారు.

భారతదేశంలో యువ ప్రతిభకు కొదవలేదు. కానీ చాలామందికి సరైన కోచ్, మార్గదర్శి, ప్రోత్సాహం వంటివి అందుబాటులో ఉండవు. ఈ నమ్మకంతోనే నేను, అంజలి మా ఫౌండేషన్‌ను ప్రారంభించాం. క్రీడలు, విద్య, ఆరోగ్య సంరక్షణలో సమాన అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం.

ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున, నాలో ఏదో ఉందని నమ్మి, నేను ఏమవుతానో ఊహించిన ఆ మొదటి వ్యక్తిని గౌరవించుకునే అవకాశం తీసుకుంటున్నాను. మా ఆరోగ్య సంరక్షణ భాగస్వామి 'ఇంగా హెల్త్ ఫౌండేషన్‌'తో కలిసి 'ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్'ను ప్రవేశపెడుతున్నందుకు గర్వంగా ఉంది. దీని ద్వారా ప్రతి ఏటా ఒక ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) వైద్యుడికి శ్రీనగర్‌లో 'క్లెఫ్ట్ అండ్ క్రేనియోఫేషియల్ కేర్'లో ప్రత్యేక శిక్షణ పొందేందుకు ఏడాది పాటు ఆర్థిక సహాయం అందిస్తాం.

నాకు ఇది కేవలం ఒక ఫెలోషిప్ మాత్రమే కాదు. విద్య అవకాశాలను సృష్టిస్తుందని, ఆ అవకాశం ఇతరుల సేవకు ఉపయోగపడినప్పుడే దానికి నిజమైన అర్థం వస్తుందని మా నాన్న బలంగా నమ్మేవారు. ఆయన నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గం ఇది. ఒక ఉపాధ్యాయుడి పాఠాలు ఒక విద్యార్థితో మొదలవ్వొచ్చు, కానీ దాని ప్రభావం ఒకరి నుంచి మరొకరికి, ఒక తరం నుంచి మరో తరానికి ప్రయాణిస్తుంది. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ సచిన్ తన పోస్టులో పేర్కొన్నారు.
Advertisement
Sachin Tendulkar
Ramesh Tendulkar Fellowship
Teachers Day
Sachin Tendulkar Foundation
Inga Health Foundation
Medical Fellowship Srinagar

More Telugu News