‘అక్కడే ఉండండి.. లేదంటే మీరే చూసుకోండి’.. ఆసియా క్రీడల్లో వసతిపై బీసీసీఐకి షాక్‌

Stay there or look after yourselves IOA shock to BCCI on Asian Games accommodation
  • ప్రత్యేక వసతి కోరిన బీసీసీఐ
  • అభ్యర్థనను తిరస్కరించిన ఐఓఏ
  • సొంత వసతి ఏర్పాటు చేసుకునే వెసులుబాటు
  • పురుషుల జట్టుకు 3 స్టార్‌ జ్ఞహోటల్‌
  • మహిళల జట్టుకు 4 స్టార్‌ హోటల్‌
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్‌ జట్లకు ప్రత్యేక వసతి కల్పించాలన్న బీసీసీఐ అభ్యర్థనను ‘భారత ఒలింపిక్‌ సంఘం’ (ఐఓఏ) తిరస్కరించినట్లు సమాచారం. అయితే నిర్వాహకులు ఏర్పాటు చేసిన వసతి తమ అవసరాలకు సరిపోదని భావిస్తే.. సొంతంగా వసతి ఏర్పాటు చేసుకునేందుకు బీసీసీఐకి అవకాశం ఇచ్చింది.

ఐఓఏ సీఈఓ రఘురామ్‌ అయ్యర్‌ మాట్లాడుతూ బీసీసీఐ సీఈఓ హేమంగ్‌ అమిన్‌ తమను సంప్రదించారని తెలిపారు. వసతి సౌకర్యాలను పరిశీలించేందుకు బీసీసీఐ వచ్చే వారం జపాన్‌కు అడ్వాన్స్‌ టీమ్‌ను పంపనుందని చెప్పారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన తర్వాత నిర్వాహకుల వసతినే ఉపయోగించాలా, సొంత ఏర్పాట్లు చేసుకోవాలా అనేది బీసీసీఐ నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేశారు.

ఆసియా క్రీడల నిర్వాహకులు ఇప్పటికే పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లకు వసతి కేటాయించారు. శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలోని పురుషుల జట్టుకు నగోయాలోని 3 స్టార్‌ ఏపీఏ హోటల్‌ నగోయా ఎకిమేలో గదులు కేటాయించినట్లు సమాచారం. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని మహిళల జట్టుకు ఓ ఫోర్‌ స్టార్‌ హోటల్‌లో వసతి కల్పించనున్నారు.

ఈ వసతులు 5 స్టార్‌ హోటళ్ల స్థాయిలో లేకపోవడంతో పాటు.. ఆటగాళ్లకు ట్విన్‌ షేరింగ్‌ విధానంలో గదులు కేటాయించడంపై బీసీసీఐలో అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

మహిళల జట్టుకు మాత్రం ప్రయాణ పరంగా మరింత సవాలు ఎదురుకానుంది. దుబాయ్ లో జరుగుతున్న ఆసియా కప్‌ లో ఫైనల్‌కు చేరితే.. ఆ మ్యాచ్‌ ముగిసిన మరుసటి రోజే జపాన్‌కు బయలుదేరాల్సి ఉంటుంది.

36 క్రీడాంశాల్లో పాల్గొనే అన్ని భారత బృందాలకు సమానంగా వసతి కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని ఐఓఏ తెలిపింది. క్రీడాకారులు వసతి, ప్రయాణం వంటి అంశాలపై కాకుండా కేవలం ఆటపై దృష్టి పెట్టేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని రఘురామ్‌ అయ్యర్‌ చెప్పారు.
Advertisement
BCCI
Indian Olympic Association
Asian Games Accommodation
Shreyas Iyer
Harmanpreet Kaur
Raghuram Iyer

More Telugu News