రేవంత్ రెడ్డి ఇంటికి ఒక న్యాయం.. ప్రజలకు మరో న్యాయమా?: రఘునందన్ రావు

Raghunandan Rao slams Revanth Reddy government over prohibited land list
  • సింఫనీ పార్క్ హోమ్స్ కాలనీలో 22ఏ బాధితుల సమావేశం
  • 12 ఏళ్ల కిందటి కాలనీని 22ఏలో చేర్చారన్న రఘునందన్ రావు
  • ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్

రూపాయి రూపాయి కూడబెట్టుకుని నిర్మించుకున్న ఇళ్లను రాత్రికి రాత్రి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ దారుణ నిర్ణయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని సింఫనీ పార్క్ హోమ్స్ కాలనీలో 22ఏ భూముల సమస్యపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులతో 55 ఎకరాల్లో 1,500 ఇళ్ల నిర్మాణం జరిగి 12 ఏళ్లు గడుస్తోందని... ఇప్పుడు ఉన్నట్టుండి ఆ ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టడంపై కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బాధితుల పక్షాన పోరాడతానని హామీ ఇచ్చారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసాన్ని ఏ దరఖాస్తు ఆధారంగా 22ఏ జాబితా నుంచి తొలగించారో, అదే నిబంధనలను సామాన్య ప్రజల ఆస్తులకు కూడా వర్తింపజేసి వెంటనే తొలగించాలని ఎంపీ రఘునందన్ రావు సూటిగా నిలదీశారు. కేవలం సాంకేతిక తప్పు జరిగిందని రెవెన్యూ మంత్రి క్షమాపణలు చెబితే సరిపోదని, తక్షణమే ఆ తప్పును సరిదిద్ది ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ 22ఏ జాబితా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Raghunandan Rao
Revanth Reddy
22A prohibited list
Symphony Park Homes Patancheru
Telangana land issues
Medak MP

More Telugu News