ఉపాధ్యాయుల కంటతడి ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి మంచిది కాదు: బండి సంజయ్
- ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్
- ఉపాధ్యాయులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన
- ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
ఉపాధ్యాయుల కన్నీళ్లతో ఏ దేశం కానీ, రాష్ట్రం కానీ బాగుపడదని, ఈ పచ్చి నిజాన్ని కాంగ్రెస్ పాలకులు తక్షణమే గ్రహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అర్ధాకలితో అలమటిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపుతున్నానని అన్నారు. రాష్ట్రంలో పీఆర్సీ అమలు కాకపోయినా, డీఏలు ఇవ్వకపోయినా ఓర్పుతో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని కొనియాడారు. బడినే సర్వస్వంగా భావించి కొవ్వొత్తిలా కరిగిన రిటైర్డ్ టీచర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మలిసంధ్యలో ఆఫీసుల చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరగడం అత్యంత విచారకరమన్నారు.
స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల కనీస సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా గురువులకు ఉచిత హామీల పాఠాలు చెప్పడం మానేసి, వారి సమస్యలను పరిష్కరించడం అనే ప్రాథమిక పాఠాన్ని నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. టీచర్స్ డే రోజైనా ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వడమే ఆ ఉపాధ్యాయ లోకానికి ఇచ్చే నిజమైన గౌరవమని బండి సంజయ్ స్పష్టం చేశారు.