లక్కీ లాటరీ సీఎం రేవంత్‌ను కూల్చే రోజులు త్వరలోనే ఉన్నాయి: కేటీఆర్

KTR says lucky lottery CM Revanth Reddy downfall is coming soon
  • రేవంత్ ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అన్న కేటీఆర్
  • 420 మోసాలకు గాను రేవంత్ 420 సార్లు రాజీనామా చేయాలని డిమాండ్
  • మంత్రులు కమీషన్ల కోసం కొట్టుకుంటున్నారని ఆరోపణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ యువతకు స్కిల్ లేదనడానికి రేవంత్ రెడ్డికి ఏ అర్హత ఉందని, ఆయన స్వయంగా ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో చేసిన మోసాలపై బీఆర్ఎస్ నిర్వహించిన ‘యువభేరి’ సభలో పాల్గొన్న కేటీఆర్, కేవలం లక్కీ లాటరీ తగలడం వల్లే రేవంత్ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీనే గడగడలాడించిన తెలంగాణ యువశక్తికి రేవంత్ రెడ్డి ఓ లెక్కే కాదన్నారు. ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరిట పెద్ద పెద్ద మాటలు చెప్పిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వడం మానేసి లూటీఫికేషన్‌లు నడుపుతున్నారని మండిపడ్డారు.


ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలంటున్న కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలా, లేక ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. ప్రజలకు చేసిన 420 రకాల మోసాలకు గానూ రేవంత్ రెడ్డి 420 సార్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు రాబోతున్నాయని హెచ్చరించారు. మంత్రులు కమీషన్ల కోసం కొట్టుకుంటున్నారని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తమ ప్రభుత్వం 2.32 లక్షల ఉద్యోగాలు ఇస్తే, ఈ వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చినవి కేవలం 16 వేల ఉద్యోగాలేనని చెప్పారు. ఉద్యోగాల కల్పనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Advertisement
KTR
Revanth Reddy
BRS Yuva Bheri
Telangana Jobs
Congress Government
Telangana Politics

More Telugu News