60 ఏళ్లకు రూ.10 కోట్లు కావాలా? ఏ వయసులో ఎంత సిప్‌ చేయాలో తెలుసా?

SIP Investment How much to invest monthly to get 10 Crores at age 60
  • 25 ఏళ్లకు సిప్‌ రూ.15,396, 30 ఏళ్లకు సిప్‌ రూ.28,329
  • 35 ఏళ్లకు సిప్‌ రూ.52,697, 40 ఏళ్లకు సిప్‌ రూ.1,00,085
  • లెక్కల్లో వార్షిక రాబడి 12%
  • కాంపౌండింగ్‌కు ఎక్కువ సమయం ఇస్తే సిప్‌ భారం తగ్గుతుంది
  • రిటైర్మెంట్‌ లక్ష్యంలో ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణించాలి
రిటైర్మెంట్‌ సమయానికి రూ.10 కోట్లు చేతిలో ఉంటే భవిష్యత్తు గురించి పెద్దగా ఆందోళన ఉండదని చాలామంది భావిస్తారు. కానీ ఆ మొత్తాన్ని చేరుకోవడానికి మీరు ఎప్పుడు పెట్టుబడి మొదలుపెడుతున్నారన్నదే అసలు కీలకం.

25 ఏళ్లకే సిప్‌ మొదలుపెడితే నెలకు పెట్టాల్సిన మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. అదే 40 ఏళ్లకు మొదలుపెడితే నెలవారీ పెట్టుబడి రూ.లక్ష దాటుతుంది. అంటే ఐదేళ్ల ఆలస్యం మీ నెలవారీ పెట్టుబడి భారాన్ని భారీగా పెంచుతుంది.
మరి 60 ఏళ్లకు రూ.10 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే 25, 30, 35, 40 ఏళ్ల వయసుల్లో నెలకు ఎంత సిప్‌ చేయాలి? లెక్కల్లో చూద్దాం. 

25 ఏళ్లలో..
మీరు 25 ఏళ్ల వయసులో సిప్‌ ప్రారంభిస్తే 60 ఏళ్ల వరకు మీకు 35 ఏళ్ల సమయం ఉంటుంది. ఈ సమయంలో ఏడాదికి సగటున 12 శాతం రాబడి వస్తుందని అనుకుంటే, నెలకు సుమారు రూ.15,396 పెట్టుబడి పెట్టాలి. అంటే రోజుకు సగటున దాదాపు రూ.513 పక్కన పెట్టినట్టే. 35 ఏళ్ల పాటు క్రమంగా పెట్టుబడి పెట్టడం వల్ల కాంపౌండింగ్‌కు ఎక్కువ సమయం దొరుకుతుంది. అందుకే రూ.10 కోట్ల లక్ష్యానికి అవసరమైన నెలవారీ సిప్‌ ఇంత తక్కువగా ఉంటుంది. 

30 ఏళ్లలో..
30 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే 60 ఏళ్లకు ఇంకా 30 ఏళ్ల సమయం ఉంటుంది. అప్పుడు నెలకు సుమారు రూ.28,329 సిప్‌ చేయాలి. 25 ఏళ్లకే ప్రారంభించడంతో పోలిస్తే ఇది దాదాపు రెండు రెట్లు. కేవలం ఐదేళ్లు ఆలస్యంగా మొదలుపెట్టడం వల్లే నెలవారీ పెట్టుబడి రూ.15 వేల స్థాయి నుంచి రూ.28 వేల స్థాయికి పెరుగుతోంది. కారణం.. మీ డబ్బుకు కాంపౌండింగ్‌ కోసం అందుబాటులో ఉన్న సమయం ఐదేళ్లు తగ్గిపోవడమే. 

35 ఏళ్లలో..
35 ఏళ్లకు సిప్‌ మొదలుపెడితే 60 ఏళ్ల వరకు 25 ఏళ్లు మాత్రమే మిగులుతాయి. ఈ సందర్భంలో నెలకు సుమారు రూ.52,697 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే 30 ఏళ్ల వయసులో ప్రారంభించాల్సిన రూ.28,329తో పోలిస్తే దాదాపు రూ.24,368 ఎక్కువ. 25 ఏళ్ల వయసులో ప్రారంభించే వ్యక్తి కంటే 35 ఏళ్ల వ్యక్తి నెలకు మూడు రెట్లకు పైగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సమయం తగ్గుతున్న కొద్దీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన పెట్టుబడి నుంచి రావాల్సిన వాటా పెరుగుతుంది. 

40 ఏళ్లలో..
40 ఏళ్ల వయసులో మొదలుపెడితే 60 ఏళ్ల వరకు కేవలం 20 ఏళ్ల సమయం ఉంటుంది. రూ.10 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలకు సుమారు రూ.1,00,085 సిప్‌ చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు నెలకు రూ.1 లక్ష. 30 ఏళ్లకే సిప్‌ ప్రారంభించిన వ్యక్తి నెలకు రూ.28,329 పెడితే సరిపోతే.. 40 ఏళ్ల వ్యక్తి అంతకంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టాలి. 25 ఏళ్ల వయసులో ప్రారంభించే వ్యక్తితో పోలిస్తే ఇది ఆరు రెట్లకు పైగా. 

ఐదేళ్లు ఆలస్యం చేస్తే ఎందుకింత తేడా?
ఇక్కడ కేవలం మీరు ఎన్ని నెలలు సిప్‌ చెల్లిస్తున్నారన్నదే ముఖ్యం కాదు. కాంపౌండింగ్‌కు దొరికే సమయం అసలు కీలకం. తొలినాళ్లలో పెట్టిన డబ్బుకు ఎక్కువ కాలం రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రాబడిపై మళ్లీ రాబడి రావడంతో కాలం గడిచేకొద్దీ పెట్టుబడి వేగంగా పెరుగుతుంది.

అందుకే 25 ఏళ్లలో నెలకు రూ.15,396తో మొదలుపెట్టే లక్ష్యం.. 40 ఏళ్లకు వచ్చేసరికి నెలకు రూ.1,00,085కు చేరుతుంది. మధ్యలో కేవలం 15 ఏళ్ల తేడా ఉన్నా సిప్‌ మొత్తం దాదాపు 6.5 రెట్లు పెరిగింది. 

అంత సిప్‌ చేయడం కష్టమైతే?
25 లేదా 30 ఏళ్ల వయసులో నెలకు పెద్ద మొత్తాన్ని కేటాయించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు తక్కువ మొత్తంతో సిప్‌ మొదలుపెట్టి, ఆదాయం పెరిగినప్పుడల్లా పెట్టుబడిని పెంచుకోవచ్చు. ప్రతి ఏడాది సిప్‌ను ఒక నిర్దిష్ట శాతంతో పెంచే స్టెప్‌-అప్‌ సిప్‌ విధానం కూడా ఉపయోగపడుతుంది. అయితే అలా చేస్తే పై లెక్కలు మారతాయి. పై మొత్తాలు ప్రతి నెలా ఒకే సిప్‌ మొత్తం కొనసాగుతుందని భావించిన లెక్కలు. 

12 శాతం రాబడి గ్యారంటీ లేదు
ఈ లెక్కల్లో ఏడాదికి 12 శాతం రాబడి వస్తుందని ఊహించారు. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు మార్కెట్‌ ఆధారితమైనవి కాబట్టి భవిష్యత్తులో ఇదే రాబడి వస్తుందని హామీ లేదు. రాబడి తక్కువగా ఉంటే రూ.10 కోట్ల లక్ష్యానికి మరింత ఎక్కువ పెట్టుబడి అవసరం కావచ్చు. రాబడి ఎక్కువగా ఉంటే అవసరమైన సిప్‌ తగ్గవచ్చు. 

రూ.10 కోట్ల విలువ అప్పటికీ ఇదేనా?
ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు రూ.10 కోట్లతో చేయగలిగే ఖర్చులు 20 లేదా 35 ఏళ్ల తర్వాత అదే మొత్తంతో చేయలేకపోవచ్చు. కాబట్టి రూ.10 కోట్లు మీ రిటైర్మెంట్‌ లక్ష్యమైతే.. భవిష్యత్తులో పెరిగే జీవన వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకుని అసలు లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.
Advertisement
SIP Investment
Retirement Planning
Mutual Funds
Wealth Creation
Financial Goals
Compounding Power

More Telugu News