కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేదు.. నాయకులంతా ఏకతాటిపై ఉన్నారు: వివేక్ వెంకటస్వామి

Vivek Venkataswamy says no groupism in Congress party as all leaders are united
  • కాంగ్రెస్ నేతలంతా రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారన్న వివేక్
  • వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని వెల్లడి
  • 22ఏ జీవోను పునఃపరిశీలిస్తున్నామన్న మంత్రి

కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా వర్గపోరు లేదని, నాయకులంతా ఏకతాటిపై నిలిచి పార్టీ బలోపేతంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజాదరణ పొందిందని వెల్లడించారు.  


రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22ఏ నిరోధిత భూముల వివాదంపై మంత్రి స్పందిస్తూ... ఈ సమస్య ముమ్మాటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాల వల్లే ఉత్పన్నమైందని మండిపడ్డారు. ఆనాటి జీవోను పునఃపరిశీలించి, సవరణలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా నిరోధిత జాబితా చిక్కులను త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. 

 

కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, డిజైన్ లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని ఆరోపించిన మంత్రి వివేక్, ఈ వైఫల్యంపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు బహిరంగ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఉనికి కోసమే ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, గత పదేళ్ల స్వార్థ పాలనను ప్రజలు ఇంకా మరచిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Vivek Venkataswamy
Telangana Congress
Revanth Reddy Government
BRS Party
Medigadda Barrage
Telangana Land Issues

More Telugu News