కొండా సురేఖ బీఆర్ఎస్‌లో చేరుతారంటూ ప్రచారం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమన్న జగదీశ్ రెడ్డి
- కొండా సురేఖ పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం
- ఆమెను బీఆర్ఎస్‌లోకి రానిచ్చే ప్రసక్తే లేదన్న జగదీశ్ రెడ్డి
- కోమటి రాజగోపాల్ రెడ్డిని కూడా చేర్చుకోబోమని వ్యాఖ్య
మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆమె బీఆర్ఎస్ లో చేరుతారని ఓవైపు, బీజేపీలో చేరుతారని మరోవైపు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సురేఖ కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరవచ్చనే ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి రానిచ్చే ప్రసక్తే లేదని, ఆమెను ఆఖరికి తెలంగాణ భవన్ గేటును కూడా తాకనివ్వబోమని తేల్చిచెప్పారు.
పార్టీని వీడి అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలను తిరిగి చేర్చుకోబోమని.. వారిలో ఒకరిద్దరికి తప్ప మిగతా ఎవరికీ గులాబీ తలుపులు తెరిచేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో, కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆయన సరికొత్త బాంబు పేల్చారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూడా జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజగోపాల్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నా ఆయనను బీఆర్ఎస్‌లోకి తీసుకోమని చెప్పారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవి కట్టబెడితే అది పూర్తిగా డబ్బులకు అమ్ముడుపోయినట్లేనని సంచలన ఆరోపణలు చేశారు. కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత చేసిన తీవ్ర ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన ఆయన... రాబోయే శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను, ముఖ్యంగా 22ఏ భూముల స్కామ్‌ను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పక్కా వ్యూహాలతో సిద్ధంగా ఉందని వెల్లడించారు.