కాంగ్రెస్‌లో అచ్చ, పచ్చ లేవు.. రేవంత్‌పై విమర్శలు చేస్తే సహించం: గుండు సుధారాణి
- సోషల్ మీడియాలో హైలైట్ కావాలనే కొండా సుస్మిత అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్న సుధారాణి
- సురేఖపై కుట్రలు చేయాల్సిన అవసరం రేవంత్ కు లేదని వ్యాఖ్య
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమన్న సుధారాణి
రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటూ ఎలాంటి వర్గాలు లేవని... పార్టీలో ఉన్న వారంతా ఒకే జెండా, ఒకే సిద్ధాంతం ప్రాతిపదికగా పనిచేస్తున్నారని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) నూతన చైర్‌పర్సన్ గుండు సుధారాణి స్పష్టం చేశారు. బీసీ వర్గానికి చెందిన తనకు ఊహించని విధంగా 'కుడా' చైర్‌పర్సన్ స్థానాన్ని కట్టబెట్టి గౌరవించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్ఠానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఇదే సమయంలో బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మితల వైఖరిపై సుధారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం సోషల్ మీడియాలో పబ్లిసిటీ పొంది హైలైట్ అవ్వాలనే ఉద్దేశంతోనే కొండా సుస్మిత ఆధారాలు లేని, అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు తిరిగి మళ్లీ కాంగ్రెస్ గూటికి వచ్చింది కొండా కుటుంబం కాదా? అని ప్రశ్నించారు. కొండా సురేఖపై కుట్రలు చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఎంతమాత్రం లేదని, నిరంతరం ప్రతికూల ప్రచారంతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సురేఖ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఇకపై ముఖ్యమంత్రిపై కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై కానీ కొండా కుటుంబం లేనిపోని విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా శ్రమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.