అక్షరాస్యతపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం: జగన్

YS Jagan Mohan Reddy calls Nara Lokesh literacy rate claims false propaganda
  • ఏపీ అక్షరాస్యతపై మంత్రి లోకేశ్‌ ప్రకటనను తప్పుబట్టిన జగన్
  • ఇది పూర్తిగా తప్పుడు సమాచారంతో కూడిన ప్రచారమని విమర్శ
  • కేంద్ర ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ వివరణ ఇచ్చిన మాజీ సీఎం
  • ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు తగ్గుతున్నారని ఆందోళన వ్యక్తీకరణ
  • విద్యాశాఖపై దృష్టి పెట్టాలని లోకేశ్‌కు సూచించిన జగన్
ఏపీలో అక్షరాస్యత రేటు 2024లో 72.6శాతం నుంచి 2026 నాటికి 82.1శాతానికి పెరిగిందంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేసిన ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

2026 క్యాలెండర్ సంవత్సరం ఇంకా పూర్తి కానందున, అక్షరాస్యతకు సంబంధించి ఏ అధికారిక సంస్థ కూడా గణాంకాలను విడుదల చేయలేదని జగన్ స్పష్టం చేశారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్ఎస్ఎస్ఓ విడుదల చేసిన 'పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే' (పీఎల్ఎఫ్ఎస్‌) 2023-24 వార్షిక నివేదికను ఆయన ఉటంకించారు. దాని ప్రకారం.. 2023 జూన్  నుంచి 2024 జూన్ మధ్య కాలంలో ఏపీలో ఏడేళ్లకు పైబడిన వారిలో అక్షరాస్యత 72.6శాతంగా ఉందని, ఇదే 2018-19లో 69.1శాతంగా ఉండేదని గుర్తుచేశారు.

అంతేకాకుండా, 2026 జులై 2న ప్రచురించిన పీఎల్ఎఫ్ఎస్‌ 2025 నివేదిక ప్రకారం.. 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ మధ్య కాలంలో రాష్ట్ర అక్షరాస్యత 71.4శాతంగా నమోదైందని తెలిపారు. వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు, ప్రభుత్వం తప్పుడు వాదనలతో ప్రజలను మభ్యపెట్టాలని చూడటం అత్యంత దురదృష్టకరమని జగన్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గి, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడీఐఎస్ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని, ఇది ఆందోళన కలిగించే విషయమని జగన్ అన్నారు. 

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకురావాలనే దానిపై దృష్టి పెట్టాల్సింది పోయి, టీడీపీ కూటమి ప్రభుత్వం మోసపూరిత వ్యూహాలతో తప్పుడు ప్రచారాలు చేసుకోవడంలో నిమగ్నమైందని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి తన శాఖపై ఎక్కువ సమయం కేటాయించాలి కానీ 'రెడ్ బుక్ గవర్నెన్స్' మీద కాదని లోకేశ్‌కు హితవు పలికారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Nara Lokesh
Andhra Pradesh Literacy Rate
TDP Coalition Government
PLFS Survey Report
AP Education Department

More Telugu News