ప్రస్తుత సినిమాలు, సెన్సార్ బోర్డు పనితీరుపై సుమన్ సంచలన వ్యాఖ్యలు
- కొందరు నిర్మాతలు, దర్శకులు తీస్తున్న సినిమాలు పిల్లలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్న సుమన్
- ఈ సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తోందో అర్థం కావడం లేదని విమర్శ
- దర్శకులు కథలను ఎంచుకునేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని హితవు
ప్రస్తుతం వస్తున్న సినిమాల తీరు, యువతపై వాటి ప్రభావం, సెన్సార్ బోర్డు పనితీరుపై టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కొందరు నిర్మాతలు, దర్శకులు తీస్తున్న చిత్రాలు ప్రేక్షకులను, ముఖ్యంగా చిన్న పిల్లలను తప్పుదోవ పట్టించేలా ఉంటున్నాయని అన్నారు. అసలు సమాజానికి చెడు సందేశాన్ని ఇచ్చే ఇలాంటి సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు ఏం చేస్తోందో, ఏ ప్రాతిపదికన అనుమతులు ఇస్తోందో అర్థం కావడం లేదని విమర్శించారు.
సినిమా అనేది కుటుంబ సమేతంగా అందరూ కలిసి థియేటర్లకు వెళ్లి ఆనందంగా ఆస్వాదించేదిగా ఉండాలని, కానీ నేటి ట్రెండ్‌లో కుటుంబ సభ్యులు కలిసి చూడలేక విడివిడిగా వెళ్లి చూసే దుస్థితి రావడం బాధాకరమని సుమన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చిన్న పిల్లలు నిరంతరం చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు పట్టుకుని, అందులో వచ్చే కంటెంట్ చూసి దారితప్పుతున్నారని, ఇలాంటి సమయంలో వస్తున్న కొన్ని వివాదాస్పద చిత్రాలు వారి ఆలోచనా విధానాన్ని మరింత పాడుచేస్తున్నాయని తెలిపారు.
సినిమా అనేది సమాజాన్ని, ప్రజల భావజాలాన్ని సానుకూలంగా మార్చే అత్యంత శక్తివంతమైన సాధనమని సుమన్ గుర్తుచేశారు. ఒక వ్యక్తి ప్రవర్తనలో మంచి అలవాట్లు, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించడానికి చలనచిత్ర రంగం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పారు. కొందరు కేవలం వ్యాపార దృక్పథంతో, లాభాలే ధ్యేయంగా సినిమాల పేరుతో సమాజాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సినీ నిర్మాతలు, దర్శకులు కథలను ఎంచుకునేటప్పుడు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని, సమాజానికి మేలు చేసేలా, మంచి మెసేజ్ ఇచ్చే చిత్రాలను మాత్రమే రూపొందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.