‘‘కాంగ్రెస్‌లో కొత్తవాళ్ల పెత్తనాన్ని సహించబోను’’.. రాజ్‌గోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Rajgopal Reddy sensational comments on newcomers dominance in Congress
  • కాంగ్రెస్‌ను కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారన్న రాజ్‌గోపాల్‌ రెడ్డి
  • నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగదని వ్యాఖ్య
  • వైఎస్సార్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడి
  • ‘సీఎం.. సీఎం’ అంటూ కార్యకర్తల నినాదాలపై కీలక వ్యాఖ్యలు
  • ‘ఆ సమయం వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు’ అని వ్యాఖ్య
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన కొందరు కాంగ్రెస్‌ను కబ్జా చేసి అధికారం చెలాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలను తాను చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు.

తెలంగాణలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారని రాజ్‌గోపాల్‌ రెడ్డి అన్నారు. తాము వైఎస్సార్‌ నిజమైన శిష్యులమని పేర్కొన్నారు. వైఎస్సార్‌ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన ఆశయాల సాధన కోసం పనిచేస్తానని, వైఎస్సార్‌ను ఎప్పటికీ మరచిపోబోనని అన్నారు.

ఎంతమంది కుట్రలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా తాను భయపడేది లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ను నమ్ముకున్న నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన రాజ్‌గోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను సీఎం.. సీఎం అని పిలుస్తున్నారు. ఆ సమయం గనక వస్తే.. దాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు’ అని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి ‘రాజన్న రాజ్యం’ కొనసాగిస్తామని రాజ్‌గోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు.
Advertisement
Komatireddy Rajgopal Reddy
Congress Party Telangana
YS Rajasekhara Reddy Vardhanthi
Munugode MLA
Rajanna Rajyam
Telangana Politics

More Telugu News