రాష్ట్రంలో సాగునీటి పండుగ.. చంద్రబాబు అపర భగీరథుడు: పట్టాభి
- రాష్ట్రంలో నిజమైన భగీరథ ప్రయత్నం జరుగుతోందన్న పట్టాభి
- గోదావరి-కృష్ణా అనుసంధానాలతో ఏపీ సస్యశ్యామలం కాబోతోందని వ్యాఖ్య
- వైసీపీ నేతలు క్రెడిట్ చోరీ డిజార్డర్ తో బాధపడుతున్నారని ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణతో నిజమైన భగీరథ ప్రయత్నం జరుగుతోందని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి కొనియాడారు. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రారంభించారని... పోలవరం కాలువను కూడా ప్రారంభించబోతున్నారని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాలతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో ఏపీ సస్యశ్యామలం కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కూటమి ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల క్యాలెండర్‌ను విడుదల చేసిందని, అందులో కేటాయించిన 36 ప్రాజెక్టుల్లో ఏకంగా 14 ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతానికే చెందడం సీమ పట్ల చంద్రబాబుకు ఉన్న అంకితభావానికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఐదేళ్ల పాలనలో జగన్ రాయలసీమ ప్రాజెక్టులకు కనీసం రూ.2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కుప్పంకు నీళ్లిచ్చామని చెప్పి ట్యాంకర్లతో నీటిని తెచ్చి డ్రామాలు ఆడారని.. కానీ చంద్రబాబు మాత్రమే నిజంగా కుప్పంకు నీటిని తీసుకెళ్లారని గుర్తుచేశారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు గ్రీజ్ కూడా పూయలేని చేతకానితనంతో నాటి ప్రభుత్వం విపత్తును కొనితెచ్చిందని విమర్శించారు. టీబీ డ్యామ్ గేట్లను యుద్ధప్రాతిపదికన మార్చి నీటి నిల్వపై భరోసా కల్పించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.
వైసీపీని 'గొడ్డలి పార్టీ'గా అభివర్ణించిన పట్టాభి... వారు క్రెడిట్ చోరీ డిజార్డర్ తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్ పేరిట వేల కోట్లు దోచుకుని, పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి, పనులు 17 నెలలు నిలిచిపోవడానికి జగనే కారణమని ఆరోపించారు. జగన్ హయాంలో 'జలయజ్ఞం' కాస్త 'ధనయజ్ఞం'గా మారిందని... అనుమతులు లేని రాయలసీమ లిఫ్ట్ పేరుతో మట్టి పనుల కింద వైసీపీ నేత పెద్దిరెడ్డికి రూ.1,000 కోట్లు దోచిపెట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు కడుపుమంటతో అల్లాడిపోతున్నారని అన్నారు.