రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ప్రగతి ఇదే: కవిత

This is the progress achieved by Revanth Reddy government says Kavitha
  • ప్రజా వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన సాగిందన్న కవిత
  • హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని మండిపాటు
  • రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ ప్రజల ప్రభుత్వమే వస్తుందని వ్యాఖ్య

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వెయ్యి రోజుల కాలం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు, నెరవేర్చని హామీలతోనే సాగిందని ఆమె ధ్వజమెత్తారు.


గడిచిన వెయ్యి రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల బతుకులను బాగు చేసింది ఏమీ లేదని, కేవలం కొందరి సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చిందని మండిపడ్డారు. హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం, సంక్షేమ గురుకులాల్లో భద్రత లేక విద్యార్థులు వరుసగా మరణించడం, జాబ్ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం, పంటలకు మద్దతు ధర లేక అన్నదాతల బలవన్మరణాలు పెరిగిపోవడం.. వీటికి తోడు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి నేరాలు నిత్యకృత్యం కావడమే ఈ ప్రభుత్వం సాధించిన అసలైన 'ప్రగతి' అని ఎద్దేవా చేశారు.


ఉద్యమకారుల నెత్తురు చిందిన నాటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, ఈ సర్కార్‌ కాలం చెల్లిపోయిందని హెచ్చరించారు. ప్రభుత్వ అరాచకాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో మళ్లీ ప్రజల ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

Advertisement
Kalvakuntla Kavitha
Revanth Reddy
Telangana Congress Government
HYDRA Demolitions
Telangana Politics
BRS Party

More Telugu News