ఇక ఉత్తరాంధ్రకు సాగునీటి కష్టాలు దూరం.. రైతుల కలను నిజం చేస్తున్నాం: మంత్రి లోకేశ్

North Andhra irrigation troubles over as we fulfill farmers dreams says Nara Lokesh
  • పోలవరం ఎడమ కాలువకు గోదావరి జలాలు విడుదల సంద‌ర్భంగా మంత్రి కీల‌క వ్యాఖ్య‌
  • కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు లబ్ధి
  • ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో ఎడమ కాలువ అనుసంధానం
  • పరిశ్రమలతో పాటు సాగునీరు అందించి అభివృద్ధి చేస్తామన్న లోకేశ్
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు తమ ప్రభుత్వం రెక్కలు తొడుగుతోందని, ఇందులో భాగంగానే పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఇప్పుడు గోదావరి జలాలను అందిస్తున్నామని తెలిపారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల ఉత్తరాంధ్ర రైతుల అభివృద్ధికి ఆరంభమని లోకేశ్ అభివర్ణించారు. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను మళ్లించి ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల రైతులకు కూడా ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. మొత్తం 2.87 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. పోలవరం కుడి కాలువ ద్వారా ఇప్పటికే రైతులు సుమారు 500 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారని, అదే తరహాలో ఎడమ కాలువ ద్వారా కూడా ఉత్తరాంధ్ర రైతుల సాగునీటి కష్టాలు తీరతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పోలవరం ఎడమ కాలువను అనుసంధానించే ప్రక్రియకు కూడా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని లోకేశ్ వెల్లడించారు. ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకురావడంతో పాటు, పాడిపంటలకు అవసరమైన సాగునీటిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. సమగ్రాభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి అనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.
Advertisement
Nara Lokesh
Polavaram Left Main Canal
North Andhra Irrigation
Godavari Water Release
Chandrababu Naidu
Uttarandhra Sujala Sravanthi

More Telugu News