యుద్ధం మంట.. మార్కెట్లలో వణుకు.. 750 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌

Sensex crashes 750 points as war tensions grip markets
  • ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతలతో మార్కెట్లకు భారీ షాక్‌
  • 750 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌
  • 23,850 దిగువన ప్రారంభమైన నిఫ్టీ
  • బ్యారెల్‌ చమురు ధర 96 డాలర్లకు చేరువ
  • ఐటీ, రియల్టీ, ఆటో షేర్లలో భారీ అమ్మకాలు
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత ముదరడంతో భారత స్టాక్‌ మార్కెట్లు బెంబేలెత్తాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య దాడులు తీవ్రం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో బుధవారం ఉదయం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఓ దశలో 750 పాయింట్లకు పైగా పతనమై 76,193.82 వద్దకు చేరింది. నిఫ్టీ 235 పాయింట్లు కోల్పోయి 23,820.75 వద్ద ప్రారంభమైంది. 

చిన్న, మధ్యతరహా షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 దాదాపు 1.22 శాతం, స్మాల్‌క్యాప్‌ 100 ఒక శాతం నష్టపోయాయి. మార్కెట్లో భయాన్ని సూచించే ఇండియా వీఐఎక్స్‌ 2.84 శాతం పెరిగి 11.82కు చేరింది. 

అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. నిఫ్టీ ఐటీ 2.47 శాతం పడిపోగా.. రియల్టీ 1.97 శాతం, ఆటో 1.83 శాతం నష్టపోయాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌ మాత్రం తక్కువ నష్టాలతో కొంత స్థిరంగా కనిపించాయి.

మార్కెట్‌ను కుదిపేస్తున్న చమురు
ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేపట్టినట్లు ప్రకటించడం, అనంతరం ఇరాన్‌ నుంచి ప్రతిస్పందన రావడంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చన్న భయాలు మొదలయ్యాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఓ దశలో దాదాపు 5 శాతం పెరిగి 97 డాలర్లకు చేరువైంది. 

ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధిపై నెలకొన్న పరిస్థితులు మదుపరులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి కీలకమైన వాటా ఉండటంతో అక్కడ రవాణా దెబ్బతింటే అంతర్జాతీయంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

రూపాయి, ద్రవ్యోల్బణంపై భయం
చమురు ధరలు పెరిగితే భారత్‌ దిగుమతి బిల్లు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. దాంతో ద్రవ్యోల్బణం, కరెంట్‌ అకౌంట్‌ లోటుపై ఒత్తిడి పెరగొచ్చు. ఇదే సమయంలో అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ కూడా పెరుగుతున్నాయి. అమెరికా 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.8 శాతానికి చేరువ కావడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు మరో ప్రతికూల అంశంగా మారింది. 

అయితే భారత ఆర్థిక వ్యవస్థలోని బలమైన దేశీయ అంశాలు మార్కెట్‌కు కొంత అండగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జీడీపీ వృద్ధి, జీఎస్‌టీ వసూళ్లు, రుణ వృద్ధి, ఆటో అమ్మకాల వంటి గణాంకాలు సానుకూలంగా ఉన్నాయి.
Advertisement
Sensex
Indian stock market
Nifty 50
Crude oil prices
Iran USA conflict
Share market crash

More Telugu News