కవిత కంటతడి పెట్టుకోవడం ఎంతో బాధించింది: మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్
- భోధన్ నుంచి కవిత పోటీ చేయాలనుకుంటే స్వాగతిస్తానన్న షకీల్ అహ్మద్
- కవిత భర్త ఊరు బోధన్ నియోజకవర్గంలోనే ఉందని వ్యాఖ్య
- కవిత కుటుంబంలో ఏం జరిగిందో తనకు తెలియదన్న షకీల్
నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తే ఆమెను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఘన స్వాగతం పలుకుతానని ఆయన స్పష్టం చేశారు.
కవిత భర్త అనిల్ స్వగ్రామం 'పొత్తంగల్' బోధన్ నియోజకవర్గం పరిధిలోనే ఉందని, ఆ రకంగా బోధన్ నియోజకవర్గానికి ఆమె సొంత అత్తగారి ఊరు, కోడలిగా పోటీ చేయడానికి పూర్తి హక్కు, అర్హత ఉన్నాయని పేర్కొన్నారు.
ఇటీవల కవిత బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై షకీల్ స్పందిస్తూ... ఆ దృశ్యం చూసి తనకు తీవ్ర బాధ కలిగిందని, అది ఆమె వ్యక్తిగత వేదన కావచ్చునని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కవిత కుటుంబంలో అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదని వ్యాఖ్యానించారు.
సొంత నియోజకవర్గాన్ని వేరొకరికి ఆఫర్ చేస్తూ షకీల్ చేసిన ఈ ప్రకటనతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది. ఆయన బీఆర్‌ఎస్‌ను వీడి కొత్త రాజకీయ దారి వెతుక్కుంటారా లేక పార్టీ మారనున్నారా అనే ఊహాగానాలు నిజామాబాద్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.