పసిడి ప్రియులకు ఊరట.. మూడు రోజుల్లో రూ.6,000 తగ్గిన బంగారం

Gold price relief as rates drop by 6000 rupees in three days
  • భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
  • ఒక్కరోజే కిలో వెండిపై రూ.10,000 పతనం
  • గత మూడు రోజుల్లో తులం బంగారంపై రూ.6,000కి పైగా తగ్గుదల
  • ఇరాన్‌పై అమెరికా దాడులతో కుప్పకూలిన మార్కెట్
  • హైదరాబాద్‌లో రూ.1.54 లక్షలకు చేరిన 24 క్యారెట్ల బంగారం
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. కిలో వెండిపై ఏకంగా రూ.10,000 తగ్గగా, 24 క్యారెట్ల బంగారం తులంపై రూ.2,680 మేర క్షీణించింది.

తాజా ధరల మార్పుతో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090కి, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,250కి చేరుకుంది. అదేవిధంగా, కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,50,000 వద్ద స్థిరపడింది. గత మూడు రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ.6,000కు పైగా తగ్గడం గమనార్హం.

ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ దాడుల ప్రభావంతో ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో, పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ కదలికలు సైతం ధరలపై ప్రభావం చూపాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు కుప్పకూలాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుపై ఏకంగా 106 డాలర్లు తగ్గి 4,323 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ సైతం 3.20 శాతం నష్టపోయి ఔన్సు 64 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఈ ధరలు బుధవారం ఉదయం నాటివి మాత్రమేనని, మార్కెట్ పరిస్థితులను బట్టి రోజులో మార్పులు ఉండవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. 
Advertisement
Gold Price
Silver Price
Hyderabad
Gold Rate Today
US Iran Conflict
Gold Price Drop

More Telugu News