ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు.. తెలంగాణ వ్యక్తి మృతి

Vavilala Sudarshan Goud from Telangana killed in Russian missile attack on Ukraine
  • మృతుడు జగిత్యాల జిల్లాకు చెందిన సుదర్శన్ గౌడ్‌గా గుర్తింపు
  • నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం ఉక్రెయిన్ వెళ్లిన సుదర్శన్
  • గది నుంచి బయటకు వచ్చిన సమయంలో క్షిపణి దాడిలో మరణం
  • ఈ దాడుల్లో మొత్తం 12 మంది మృతి చెందినట్లు సమాచారం
ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన భారీ క్షిపణి దాడుల్లో తెలంగాణ వ్యక్తి దుర్మరణం చెందాడు. జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 

సుదర్శన్ గౌడ్ ఉపాధి నిమిత్తం సుమారు నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్ వెళ్లారు. అంతకుముందు స్వగ్రామంలోనే షట్టరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మంగళవారం ఉదయం రష్యా సైన్యం కీవ్‌తో పాటు పలు నగరాలపై క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులకు తెగబడింది. ఆ సమయంలో సుదర్శన్ తాను నివసిస్తున్న గది నుంచి బయటకు రాగా, క్షిపణి దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ఈ దాడుల్లో సుదర్శన్‌తో పాటు మరో 11 మంది కూడా మరణించినట్లు సమాచారం. ఉక్రెయిన్‌లోనే ఉంటున్న సమీప తాటిపల్లి గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తి ద్వారా సుదర్శన్ మరణవార్త కుటుంబ సభ్యులకు చేరింది. పొట్టకూటి కోసం వెళ్లిన తమ ఆప్తుడు యుద్ధానికి బలికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Advertisement
Vavilala Sudarshan Goud
Russia Ukraine War
Telangana man killed in Ukraine
Jagtial native death Ukraine
Russian missile attack
Indian killed in Ukraine war

More Telugu News