ఉత్తరాంధ్ర చరిత్రలో అపురూప ఘట్టం.. రేపు పాయకరావుపేటలో గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు జల హారతి

Chandrababu Naidu to perform Jala Harathi for Godavari waters in Payakaraopeta tomorrow
  • పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు
  • రేపు పాయకరావుపేటలో జలాలకు హారతి ఇచ్చి విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
  • 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యం
  • నాలుగు నదులు, తూర్పు కనుమలు దాటుతూ సాగిన కాలువ నిర్మాణం
  • భవిష్యత్తులో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానం చేసి 8 లక్షల ఎకరాలకు నీరు
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ గోదారమ్మ ఆ ప్రాంతంలోకి అడుగుపెడుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లా వరకు పరుగులు పెడుతున్నాయి. నాలుగు నదులను, తూర్పు కనుమల కొండలను దాటుకుని వస్తున్న ఈ జలధార, ఉత్తరాంధ్ర బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సిద్ధమైంది. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (సెప్టెంబరు 2) అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో గోదావరి జలాలకు ‘జల హారతి’ ఇచ్చి లాంఛనంగా విడుదల చేయనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాదిలోనే అనకాపల్లికి నీళ్లు అందించి, కూటమి ప్రభుత్వం తన సంకల్పాన్ని నిలబెట్టుకుంది.

మంగళవారం మధ్యాహ్నం 2:20 గంటలకు పాయకరావుపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కాలువపై నిర్మించిన రెగ్యులేటర్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంతో ఉత్తరాంధ్ర సాగునీటి చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కానుంది.

కొండలు, నదులు దాటిన ఇంజనీరింగ్ అద్భుతం

గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించడం అనేది ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ప్రయాణంలో పంపా, తాండవ, వరాహ, శారద వంటి నాలుగు నదులను, ఏలేరు కాలువను, తూర్పు కనుమలను దాటాల్సి వచ్చింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,192 కోట్లు వెచ్చించి అధునాతన సాంకేతికతతో నిర్మాణాలు చేపట్టింది. కొన్నిచోట్ల నదుల ప్రవాహానికి ఎగువన అక్విడెక్టులు, మరికొన్ని చోట్ల ప్రవాహానికి దిగువన సైఫన్లు నిర్మించారు. ముఖ్యంగా ఏలేరు నది గర్భం కింద నుంచి గోదావరి నీటిని తరలించేందుకు సైఫన్‌ను, పంపా నదిపై 30 మీటర్ల లోతు పునాదులతో భారీ అక్విడెక్టును నిర్మించారు. 10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా తాండవ నదిపై 447 మీటర్ల పొడవున అక్విడెక్టు నిర్మాణం చేపట్టడం ఈ ప్రాజెక్టు సంక్లిష్టతకు నిదర్శనం.

లక్షల ఎకరాలకు భరోసా.. భవిష్యత్తుకు మార్గం

ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. దీంతోపాటు జిల్లాలోని 110 చెరువులను నింపేందుకు జలవనరుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పుష్కర ఆయకట్టు కింద 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా, తాండవ, వరాహ తదితర ఆయకట్టుల కింద మరో 58,000 ఎకరాలకు పైగా భూమి స్థిరీకరణ జరగనుంది.

వచ్చే ఏడాది నాటికి ఈ జలాలను విశాఖపట్నం వరకు పొడిగించి, ఆపై ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 213 కిలోమీటర్ల పొడవైన ఈ ఎడమ కాలువ ద్వారా మొత్తం 23.44 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెస్తారు. ఈ బృహత్తర ప్రణాళిక పూర్తయితే అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలతో సహా మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అంది, ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోనుంది.


Advertisement
Chandrababu Naidu
Godavari Jala Harathi
Polavaram Left Canal
Payakaraopeta Anakapalli
Uttarandhra irrigation
North Andhra water

More Telugu News