రేవంత్ రెడ్డి భాషపై ఎథిక్స్ కమిటీలో చర్చించాలి: వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్
- అసెంబ్లీలో రేవంత్ వాడుతున్న భాషపై ఎథిక్స్ కమిటీలో విచారణ జరపాలన్న వేముల
- అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించిన వారిపై ఛైర్మన్ కు ఫిర్యాదు చేశామని వెల్లడి
- కౌశిక్ రెడ్డికి వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని విన్నపం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వాడుతున్న పదజాలం, అనుచిత వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీలో విచారణ జరపాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎథిక్స్ కమిటీ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తరఫున తమ వాదనను ఎంతో బలంగా వినిపించామని వెల్లడించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వివాదం జరిగిన రోజు కేవలం కాంగ్రెస్‌కు చెందిన 23 మంది ఎమ్మెల్యేలతోనే సభలో మాట్లాడించారని... అది ఏ విధంగా 'మూడ్ ఆఫ్ ది హౌస్' అవుతుందని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఏకపక్ష మాటలను ప్రాతిపదికగా చేసుకుని, కౌశిక్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీ ఎజెండాలో చేర్చడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని దుయ్యబట్టారు.
సభా నాయకుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించడంపై చర్యలు తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ చైర్మన్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వీర్లపల్లి శంకర్, మందుల శామ్యూల్‌లు సభలో చేసిన అసభ్య వ్యాఖ్యలు, అనుచిత హావభావాల వీడియో ఆధారాలను కూడా కమిటీకి సమర్పించామని వివరించారు. ఈ విజ్ఞప్తిపై క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డికి తన వివరణ ఇచ్చుకునే సరైన అవకాశం ఇవ్వాలని కోరామన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీలో సహకరించుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఏం జరుగుతుందో స్పష్టత లేదని, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు.