ఏజెన్సీలో డ్రోన్లతో వైద్య సేవలు.. సీఎం చంద్రబాబు ప్రకటన

Chandrababu Naidu Announces Drone Medical Services In Agency Areas
  • ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్లతో వైద్య సేవలు
  • మందులు, రక్త నమూనాల రవాణాకు డ్రోన్ల వినియోగం
  • పీహెచ్‌సీలను జిల్లా ఆసుపత్రులతో అనుసంధానించేలా ప్రణాళిక
  • టెక్నాలజీతో ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
  • మారుమూల ప్రాంతాల్లోని ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందిస్తామని హామీ
ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు వైద్య సేవలను వేగంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించుకోనుంది. డ్రోన్ల ద్వారా మందులు, వైద్య పరికరాలను సరఫరా చేసే బృహత్తర ప్రాజెక్టును త్వరలో విస్తృతం చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సాంకేతికత ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చినప్పుడే దానికి నిజమైన సార్ధకత లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తలపెట్టిన డ్రోన్ ప్రాజెక్టును సమీక్షించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా స్పందిస్తూ, రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉండే గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందించడంలో డ్రోన్లు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని అన్నారు. డ్రోన్ల ద్వారా రక్త నమూనాలను సేకరించడం, అత్యవసర ఔషధాలను వేగంగా చేరవేయడం వంటివి ఈ ప్రాజెక్టులో కీలకమని వివరించారు.

ఈ వ్యవస్థ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్‌సీ) జిల్లా ఆసుత్రులతో, ఇతర వైద్య విభాగాలతో అనుసంధానించడం సులభతరం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఉన్న ఈ విధానాన్ని మరింత వ్యవస్థీకృతం చేసి, అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలో నివసించే ప్రతి పౌరుడికీ నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

టెక్నాలజీ సహాయంతో ఆరోగ్య సేవలను మరింత వేగవంతం చేసి, ప్రజల ప్రాణాలను కాపాడే వ్యవస్థలను బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ ద్వారా ఈ వివరాలను పంచుకున్నారు.
Advertisement
Chandrababu Naidu
Medical Drones Andhra Pradesh
Agency Area Healthcare
AP Government Drone Project
Drone Medicine Delivery
Digital Health Services AP

More Telugu News