శ్రీశైలం ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ వినియోగించుకోవడం లేదు: కాకాణి
- శ్రీశైలం ప్రాజెక్టులో 71 శాతం వరకు నీటి నిల్వలు ఉన్నాయన్న కాకాణి
- సోమశిల, కండలేరు జలాశయాలకు నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్న
- నెల్లూరు జిల్లాలోని జలాశయాలు అడుగంటిపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన
శ్రీశైలం జలాశయంలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ దానిని ఉపయోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపు 71 శాతం వరకు నీటి నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ... సోమశిల, కండలేరు జలాశయాలకు నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన నిలదీశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వెంటనే నీటిని ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని... రాయలసీమ, నెల్లూరు జిల్లా రైతాంగాన్ని నిట్టనిలువునా ముంచడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశమా అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలోని జలాశయాలు అడుగంటిపోయే పరిస్థితి దాపురించినా ప్రభుత్వం మౌనంగా ఉండటం వెనుక ఉన్న దురుద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని ఎడాపెడా తరలించుకుపోతుంటే, ఏపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని కాకాణి మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ రైతుల జీవితాలను తాకట్టు పెడుతున్నారా అని ప్రశ్నించారు. సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్లే మొదటి పంటకే సాగునీరు అందక నెల్లూరు జిల్లా రైతాంగం ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.