ఒంగోలు సమీపంలో రాడిసన్ 5 స్టార్ హోటల్: శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్
- రూ. 100 కోట్లతో చదలవాడ వద్ద 5 స్టార్ హోటల్
- రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్‌ఎల్‌పీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో హోటల్
- హాస్పిటాలిటీ, టూరిజం, రవాణా, సేవా రంగాల్లో స్థానిక యువతకు ఉపాధి
ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించి ఒక కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఒంగోలు పరిసర ప్రాంతమైన చదలవాడ వద్ద రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ 'రాడిసన్' 5 స్టార్ హోటల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రసిద్ధ రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్‌ఎల్‌పీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రతిష్టాత్మక హోటల్ రూపుదిద్దుకోనుంది.
ఒంగోలు ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్న మొదటి అంతర్జాతీయ బ్రాండెడ్ 5 స్టార్ హోటల్ ఇదే కావడం విశేషం. 151 విలాసవంతమైన గదులు, మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్లు, ప్రీమియం బార్, లాంజ్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్‌నెస్ సెంటర్ వంటి అత్యాధునిక సదుపాయాలతో దీనిని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా, బిజినెస్ టూరిజం విస్తరణకు అనుగుణంగా 2,100 చదరపు మీటర్లకు పైగా విశాలమైన స్థలంలో భారీ బ్యాంకెట్ హాళ్లు, కాన్ఫరెన్స్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారి-16కి అత్యంత సమీపంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ వల్ల పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, పర్యాటకులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.
ఈ విలాసవంతమైన 5 స్టార్ హోటల్ రాకతో ఒంగోలు, దాని పరిసర ప్రాంతాల్లో హాస్పిటాలిటీ, టూరిజం, రవాణా, సేవా రంగాల్లో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం లోకేశ్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. అభిమానులతో ఫొటోలు దిగుతూ, వారి నుంచి వినతులను స్వీకరించారు. రక్షా బంధన్ సందర్భంగా పలువురు మహిళా కార్యకర్తలు లోకేశ్‌కు రాఖీలు కట్టి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.