రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ, సీతక్క
- రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలతో తీవ్ర వివాదం
- కొండా సురేఖపై వేటు వేస్తారంటూ జోరుగా ప్రచారం
- రాఖీ పండుగ సందర్భంగా రేవంత్ నివాసానికి వెళ్లిన కొండా సురేఖ
రక్షా బంధన్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిసి సీఎం నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా, ఇటీవల పరకాల నియోజకవర్గం కేంద్రంగా చెలరేగిన తీవ్ర రాజకీయ వివాదం, కుమార్తె సుస్మిత వ్యాఖ్యల దుమారం తర్వాత మంత్రి కొండా సురేఖ నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదానికి ప్రధాన కారణం ములుగు, పరకాల ప్రాంతాల్లో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న అధికారిక కార్యక్రమాలకు వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడమే. స్థానిక పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో సురేఖ వర్గానికి తీవ్ర విభేదాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో రేవూరిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరడంతో, ఆయనకే మళ్లీ టికెట్ అనే సంకేతాలు వెళ్లాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా సురేఖ కుమార్తె సుస్మిత గీసుకొండలో ప్రత్యేక సభ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరిలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు రాబోయే ఎన్నికల్లో తాను పరకాల నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.
సీఎంపై నేరుగా జరిగిన ఈ విమర్శలను కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ద్వారా కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అయితే తన కుమార్తె చేసిన కామెంట్లకు తాను బాధ్యురాలిని కానని సురేఖ వివరణ ఇచ్చినప్పటికీ, ఆమెపై కేబినెట్ నుంచి వేటు పడే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా సాగాయి. ఇలాంటి తీవ్ర ఉత్కంఠ వాతావరణంలో, రాఖీ పండుగ సందర్భంగా కొండా సురేఖ నేరుగా సీఎం నివాసానికి వచ్చి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ద్వారా వివాదాలకు స్వస్తి చెప్పి రాజీ మార్గాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.